‘సముద్ర’ ఆదాయంపై సర్కార్‌ దృష్టి

28 Jun, 2021 04:31 IST|Sakshi

రాష్ట్రంలో 974 కి.మీ. సముద్ర తీరాన్ని వినియోగించుకోవడానికి మాస్టర్‌ ప్లాన్‌

పోర్టు ఆధారిత వ్యాపార అవకాశాలతో ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళిక 

సాక్షి, అమరావతి: ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 4 పోర్టులు, 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం ఇతర వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. రాష్ట్రంలో 974 కి.మీ సముద్ర తీరాన్ని ఉపయోగించుకుంటూ.. ఎలా అభివృద్ధి చేయొచ్చో మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయడానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ను పిలిచింది.

వాణిజ్య పోర్టులు, కంపెనీల సొంత పోర్టులు–జెట్టీలు, ఓడల నిర్మాణం, రీసైక్లింగ్, డ్రైపోర్టులు, మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు, ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ లాండింగ్‌ కేంద్రాలు, పోర్టు ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లు, మెరైన్‌ టూరిజం, డీశాలినేషన్‌ ప్లాంట్లు, పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో కన్సల్టెంట్‌ను నియమించుకోవడం ద్వారా పోర్టు ఆధారిత వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్ణయించినట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు టెండర్‌ నోటీసులో పేర్కొంది. జూలై 6న ప్రారంభమయ్యే టెండర్లు.. 12న మధ్యాహ్నం ముగుస్తాయి. టెండర్‌ దక్కించుకున్న తేదీ నుంచి నెల రోజుల్లో మాస్టర్‌ ప్లాన్‌ నివేదిక ఇవ్వాలని నిబంధన విధించారు. 

మరిన్ని వార్తలు