Medical Colleges: కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తు.. వచ్చే ఏడాదికల్లా మరో ఐదు అందుబాటులోకి..

9 Aug, 2022 03:22 IST|Sakshi

వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో ఐదు అందుబాటులోకి..

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు దరఖాస్తు చేసిన ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు

అక్కడి జిల్లా ఆస్పత్రులు బోధనాసుపత్రులుగా అప్‌గ్రేడ్‌

అకడమిక్‌ కార్యకలాపాల కోసం రూ.401 కోట్లతో వనరులు

మరోవైపు రూ. 16 వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘నాడు–నేడు’ 

సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం (2023–24) నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు వీలుగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు చేసే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరంలలో ఏర్పాటవుతున్న కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్‌ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వైద్యశాఖ వేగంగా చేపడుతోంది. 

వీటి ఏర్పాటు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆస్పత్రులను డీఎంఈ పరిధిలోకి బదలాయించి, ఈ ఐదుచోట్ల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌లను నియమించారు. వీరే కొత్త కాలేజీల అనుమతుల కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశారు.

రూ.401 కోట్ల వ్యయంతో..
ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.401.40 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో ఆస్పత్రిలో రూ.5 కోట్లతో అదనపు నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతోంది. రూ.100 కోట్లతో అవసరమైన పరికరాలను కూడా సమకూరుస్తోంది. అలాగే, వైద్య కళాశాలల కార్యకలాపాల కోసం నంద్యాల, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం మచిలీపట్నంలలో రూ.146 కోట్లతో ప్రీ–ఇంజనీర్డ్‌ బిల్డింగ్స్‌ (పీఈబీ) నిర్మిస్తున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు లెక్చర్‌ హాళ్లు, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అనాటమీ బ్లాకులతో పీఈబీలు నిర్మిస్తున్నారు. 

రూ.16 వేల కోట్లతో నాడు–నేడు
వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం రూ.16వేల కోట్లకు పైగా వ్యయంతో నాడు–నేడు కార్యక్రమానికి సీఎం జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతమున్న 11 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, ఇతర ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు 16 నూతన వైద్య కళాశాలలను ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం రూ.12,268 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, నంద్యాలలో 2023–24 నాటికి, మిగిలిన 11 చోట్ల 2024–25లోగా వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 

ఈ ఏడాది ఆఖరులో తనిఖీలు 
ఐదు కొత్త వైద్య కళాశాలల అనుమతుల కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశాం. ఈ ఏడాది ఆఖరులో ఎన్‌ఎంసీ బృందం తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. తనిఖీల అనంతరం అనుమతులు మంజూరు అవుతాయి.
– డాక్టర్‌ ఎం. రాఘవేంద్రరావు, డీఎంఈ 

కొత్తగా 750 ఎంబీబీఎస్‌ సీట్లు
కొత్తగా ఏర్పాటయ్యే ఈ ఐదు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రెండు వేలకు పైగా ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి కొత్త కాలేజీల ఏర్పాటు ఎంతో వరంగా మారనుంది. 

మరిన్ని వార్తలు