చెంచులకు ‘ఉపాధి హామీ’ ఇవ్వండి

13 Sep, 2022 04:01 IST|Sakshi

కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం

అల్ప సంఖ్యాకులైన చెంచులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ 

సాక్షి, అమరావతి: నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల బతుకు దెరువు కోసం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మారిన నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది చెంచులకు ఈ పథకాన్ని నిలిపివేసింది. దీంతో అత్యల్ప సంఖ్యాకులైన చెంచులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉపాధి హామీ కోసం కేంద్రానికి లేఖ రాసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులకు ప్రత్యేక పథకంగా ఉపాధి హామీని 2009 నుంచి వర్తింపజేసి 180 రోజుల పనిదినాలు కల్పించారు. దీనికి తోడు ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అనే నిబంధన కాకుండా సడలించి.. ముగ్గురికి జాబ్‌కార్డ్‌ ఇచ్చారు. ఆ ముగ్గురికి మొత్తంగా 540 పనిదినాలు ఇచ్చేవారు. పోషకాహారలోపంతో బలహీనంగా ఉండే చెంచులకు ప్రత్యేక మినహాయింపు కూడా ఇచ్చారు.

70 % పని చేస్తే వంద శాతం పనిచేసినట్టు చూపి చెల్లింపులు జరిపేవారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 125 గ్రామాల్లోని చెంచు కుటుంబాల బతుక్కి భరోసా దక్కేది. వారికి కేటాయించే పని దినాలను లెక్కగట్టి ఉపాధి కూలి మొత్తంలో పని చేయకముందే సగం డబ్బులను అడ్వాన్సుగా ఇచ్చేవారు. మిగిలిన సగం పని పూర్తి చేసిన తర్వాత ఇచ్చేవారు.

మొత్తం పనిదినాల్లో మొత్తం కూలిని సగం నగదుగాను, మిగిలిన సగాన్ని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా కందిపప్పు, బియ్యం, చింతపండు, బెల్లం, చక్కెర వంటి 20 రకాల సరుకులు ఇచ్చేవారు. దీన్నే ఫుడ్‌ బాస్కెట్‌ అని పిలిచేవారు. కాగా, ఫుడ్‌ బాస్కెట్‌ పద్ధతి 2012తో ఆగిపోవడంతో మొత్తం నగదును ఇవ్వడం ప్రారంభించారు. వారికి నిర్ణయించిన రోజువారీ వేతనం డబ్బులను ఎప్పటికప్పుడు చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ చెంచు మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు.

ఒక్కో గ్రూపులో ముగ్గురు లీడర్లకు ఉపాధి హామీ పనుల నగదు చెల్లింపులు బాధ్యతలు అప్పగించేవారు. ఇలా అన్ని రకాలుగా ఊతమిచ్చిన ఉపాధి హామీ కేంద్రం నిబంధనలతో గతేడాదిలో ఆగిపోవడంతో చెంచులు ఆవేదన చెందుతున్నారు. 

చెంచులకు ఉపాధి కోసం కేంద్రాన్ని కోరాం
దేశంలో అత్యంత అల్ప సంఖ్యాకులుగా ఉన్న చెంచుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అనేక చర్యలు చేపట్టాం. వారికి ఎంతో మేలు చేసే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిలిపివేయడం ఇబ్బందికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లోని 171 చెంచు గూడెంలలో ప్రజలకు ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు.

పరిస్థితిని సానుకూలంగా ఆలోచించి చెంచులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని ఉపాధి హామీ కల్పించాలని కేంద్రాన్ని కోరాం. ఇటీవల దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన శాఖలతో నిర్వహించిన సమావేశంలోను కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి అర్జున్‌ముండాకు చెంచుల పరిస్థితిని వివరిస్తూ ఉపాధి కొనసాగింపు కోసం నివేదిక ఇచ్చాం.     
    – పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి 

మరిన్ని వార్తలు