ఇంటింటికి అమృతధార

3 Jun, 2022 12:41 IST|Sakshi

ఊరూరా మైక్రో వాటర్‌ ఫిల్టర్ల ఏర్పాటు 

తొలి విడతలో గుడ్లవల్లేరు మండలంలో పనులు  

ఇప్పటికే 12 పంచాయతీల్లో పనులు పూర్తి  

విడతల వారీగా ఉమ్మడి జిల్లాలో పనులకు శ్రీకారంగ్రామాల్లో శుద్ధ జలాలు అందించేలా ప్రణాళిక

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించే లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మైక్రో వాటర్‌ ఫిల్టర్లను గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసేందుకు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన పనులను కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలంలో ప్రారంభించారు. ఈ మండలంలోని 22 గ్రామ పంచాయతీలుండగా, ఇప్పటికే 12 పంచాయతీల్లో ఈ ఫిల్టర్‌ మార్పు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పంచాయతీల్లో కూడా వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.   

సమస్య ఇదీ.. 
ప్రస్తుతం గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. అయితే ఇందులో స్లో శాండ్‌ ఫిల్టర్లు ఉండటంతో, వాటి నిర్వహణ పంచాయతీలకు భారంగా మారింది. ఫిల్టర్లు కడగటం వల్ల అరిగిపోయి తరుచూ మార్చాల్చి వస్తోంది. దీనికితోడు ఈ ప్రాసెస్‌ కోసం క్వాలిటీ ఇసుక అవసరం కావడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది.  

శేరీదగ్గుమిల్లిలో నిర్మించిన మైక్రో వాటర్‌ ఫిల్టర్‌ 

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో.. 
►జిల్లాలో ఎక్కువ శాతం తాగునీటి చెరువులు, కాలువల ద్వారా వచ్చే నీటినే తాగునీటికి వినియోగిస్తున్నారు. ఈ నీటిని శుద్ధి చేసేందుకు ఫిల్లర్లు తప్పని సరి.  
►ఈ నేపథ్యంలో పంచాయతీలపై నిర్వహణ భారాన్ని తప్పించేందుకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సాయంతో.. గుడ్లవల్లేరు పంచాయతీల్లోని జనాభా ఆధారంగా 0.5 ఎంఎల్‌డీ, ఒక ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన మైక్రో వాటర్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు.  
►0.5 ఎంఎల్‌డీ వాటర్‌ ఫిల్టర్ల ఏర్పాటుకు రూ.5లక్షలు ఖర్చు అవుతోంది. ఈ నిధులను జెడ్పీ నుంచి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సమకూర్చుతున్నారు.  
►ఇప్పటికే 12 గ్రామాల్లో రూ.70 లక్షలతో మైక్రో వాటర్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు.  
►ఇంకా 12 గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా రూ.85 లక్షలతో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకొంటున్నారు.  
►మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఫ్లాట్‌ ఫారాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఫ్లాట్‌ పారం నిర్మాణానికి రూ. 2.5లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతోంది. 

తగ్గనున్న నిర్వహణ భారం.. 
మైక్రోఫిల్టర్ల ఏర్పాటుతో శుద్ధి చేసిన నీటితో పాటు, పంచాయతీలపైన వీటి నిర్వహణ భారం తగ్గనుంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించడం వల్ల మూడేళ్ల వరకు ఇబ్బంది ఉండదు. దీని తర్వాత దశల వారీగా మిగిలిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. పెడన మండలంలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.  

ప్రజారోగ్యమే దేశ సౌభాగ్యం.. 
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని బాపూజీ చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం పాటిస్తోంది. అందులో భాగంగానే మా గ్రామంలో శుద్ధ జలాలు అందించేందుకు మైక్రో వాటర్‌ ఫిల్టర్‌ల ఏర్పాటుకు కృషిచేస్తోంది. ప్రజలకు  స్వచ్ఛమైన సురక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికకు మా గ్రామస్తుల తరఫున      కృతజ్ఞతలు తెలుపుతున్నా. 
– డాక్టర్‌ బండారు శ్యామ్‌కుమార్, సింగలూరు, గుడ్లవల్లేరు మండలం 

రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం.. 
గుడ్లవల్లేరు మండలాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.  ఇందులో భాగంగానే మొదటి దశలో అన్ని గ్రామాలకు శుద్ధి నీరు అందిస్తున్నాం.  ఆ తర్వాత విడతల వారీగా మిగిలిన గ్రామాల్లోనూ పనులు ప్రారంభిస్తాం. ఇక నాడు–నేడు ద్వారా పీహెచ్‌సీలు, పాఠశాలలను ఆధునికీకరిస్తున్నాం. ఈ పథకం కింద కవర్‌కాని పాఠశాలలను జెడ్పీ నిధులతో ఆధునికీకరిస్తున్నాం.  
– ఉప్పాల హారిక, జెడ్పీ చైర్‌పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లా

చదవండి: నీట్‌ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థిని హర్షితకు జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్‌

మరిన్ని వార్తలు