రయ్‌.. రయ్‌ రహదారులు

8 Sep, 2021 03:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: రహదారుల అభివృద్ధికి భారీ కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ఇరుకు రహదారులపై అవస్థలతో కూడిన ప్రయాణానికి ఇక తెర పడనుంది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రెండు లేన్ల రహదారుల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఎన్‌డీబీ) నుంచి రూ.6,400 కోట్ల రుణంతో రాష్ట్రంలో రెండు దశల్లో 2,500 కి.మీ.మేర రోడ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం తొలిసారిగా ‘ప్రత్యేక ఫండ్‌ అకౌంట్‌’ తెరవాలని నిర్ణయించడం విశేషం. 

రోడ్ల కోసం ‘ప్రత్యేక ఫండ్‌ అకౌంట్‌’
రాష్ట్రంలో రహదారులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌బీడీ బ్యాంకు రుణంతో జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక ఫండ్‌ అకౌంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఆర్‌ అండ్‌ బి శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధికి ఎన్‌డీబీతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. మేర రోడ్లు నిర్మించనున్నారు.

రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. మేర రహదారులు నిర్మిస్తారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు ‘ప్రత్యేక ఫండ్‌ అకౌంట్‌’ను తెరవాలని తాజాగా నిర్ణయించారు. ఎన్‌డీబీ రుణ మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేస్తారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటారు. టీడీపీ హయాంలో 2018లో రోడ్ల నిర్మాణం కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. ఫలితంగా చాలా చోట్ల రహదారులు అధ్వాన్నంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డీబీ నిధులను పూర్తిగా రోడ్ల నిర్మాణానికే వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం కేంద్ర ఆర్థిక శాఖలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌(డీఈఏ) అనుమతి కోరనుంది. ఆ వెంటనే ప్రత్యేక ఫండ్‌ అకౌంట్‌ను తెరుస్తారు. 

తొలిదశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. రోడ్లు 
ఎన్‌డీబీ నిధులతో మొదటి దశలో రాష్ట్రంలో మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతోనూ, సమీపంలోని మండల కేంద్రంతోనూ అనుసంధానిస్తూ 1,244 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్లు నిర్మిస్తారు. అందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో రూ.3,014 కోట్లతో మొత్తం 124 పనులకు టెండర్లు కూడా ఖరారు చేసి పనులు ప్రారంభించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.85.43కోట్ల ప్రజాధనాన్ని కూడా ఆదా చేశారు. వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బి శాఖ నిర్ణయించింది. 

రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. రోడ్లు
ఎన్‌డీబీ నిధులతో రెండోదశలో 1,268 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులను నిర్మిస్తారు. రూ.3,386 కోట్లతో నిర్మించే ఈ రోడ్ల కోసం డీపీఆర్‌ రూపొందిస్తున్నారు. అక్టోబరులో టెండర్ల ప్రక్రియ నిర్వహించి డిసెంబరులో పనులు ప్రారంభించి వేసవికి పూర్తి చేయాలన్నది ఆర్‌ అండ్‌ బి శాఖ ప్రణాళిక.

జిల్లా కేంద్రాలకు మెరుగైన రవాణా వసతి
రూ.6,400 కోట్లతో జిల్లా ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. ఈ పనులకు ప్రత్యేక ఫండ్‌ అకౌంట్‌ తెరవాలని నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు మెరుగైన రోడ్‌ కనెక్టివిటీ  కల్పిస్తాం.
–కె.వేణుగోపాల్‌రెడ్డి, ఈఎన్‌సీ, ఆర్‌ అండ్‌ బి 

ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు అభివృద్ధి చేయాలని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా కార్యదర్శి గిరిధర్‌ అరిమానేను రాష్ట్ర మంత్రి శంకరనారాయణ కోరారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తదితరులతో కలిసి కేంద్ర కార్యదర్శితో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల పనులు, నూతనంగా మంజూరు కావాల్సిన రహదారులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించారు.
కేంద్ర హైవేల శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరిమానేతో రాష్ట్ర మంత్రి శంకరనారాయణ తదితరులు  

అనంతరం మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. బెంగళూరు విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని కోరామన్నారు. విశాఖబీచ్‌ రోడ్డు–పోర్టు కనెక్టివిటీ, విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌ పనులు, విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద పనుల పురోగతి వివరించి త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు. బుగ్గ–గిద్దలూరు నాలుగు లేన్ల రహదారి ప్రతిపాదన, గతంలో జాతీయ రహదారులుగా ప్రకటించాలని కోరిన హిందూపురం–ముద్దనూరు, పావగడ–బుక్కపట్నం, రాజంపేట–కదిరి పనుల గురించి గిరిధర్‌తో చర్చించామన్నారు. ప్యాపిలి–బనగానపల్లి, గుత్తి నుంచి కర్ణాటక సరిహద్దు, దామాజిపల్లి నుంచి ధర్మవరం మీదుగా ఎన్‌హెచ్‌544డీ కనెక్షన్‌ రోడ్డు, మడకశిర–బుక్కపట్నం రోడ్డు తదితర పది రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరామన్నారు.  

మరిన్ని వార్తలు