రూ. 256.53 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీలో పూడికతీత

10 Feb, 2022 04:08 IST|Sakshi

రెండు ప్యాకేజీల కింద టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ 

21న ఆర్థిక బిడ్, రివర్స్‌ టెండరింగ్‌

బ్యారేజీలో రెండుకోట్ల క్యూబిక్‌ మీటర్లకుపైగా ఇసుక మేటలు

మేటల తొలగింపుతో నీటి నిల్వ సామర్థ్యం పెంపు

పూడిక తీసిన ఇసుక ఏపీఎండీసీ ద్వారా విక్రయం

సాక్షి, అమరావతి:  ధవళేశ్వరం బ్యారేజీలో మేటలు వేసిన రెండు కోట్ల క్యూబిక్‌ మీటర్లకుపైగా ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక మేటల తొలగింపునకు రూ. 256.53 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 21న ఆర్థిక బిడ్, అదే రోజున రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి.. టెండర్లను జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఇసుక మేటల తొలగింపు ద్వారా బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీని ద్వారా గోదావరి డెల్టా రైతులకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయడంతో పాటు పూడిక తీసిన ఇసుక ద్వారా నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాలన్నది సర్కార్‌ ఉద్దేశ్యం అని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

గోదావరి డెల్టాలో ఉన్న 10.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తారు. ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 2.931 టీఎంసీలు. బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో భారీగా ఇసుక మేటలు వేయడం వల్ల ఆ నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గింది. ఖరీఫ్‌లో పంటలకు నీళ్ల ఇబ్బంది లేకపోయినా.. రబీలో నీళ్లందించడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో బ్యారేజీకి 3 కి.మీ. నుంచి 12.5 కి.మీ. వరకూ ఎడమ వైపున ఇసుక మేటల తొలగింపునకు రూ. 135.85 కోట్లు.. కుడి వైపున ఇసుక దిబ్బల తొలగింపునకు రూ. 120.68 కోట్లతో అధికారులు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. టెండర్లను ఖరారు చేశాక ఇసుక తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. 

ఏపీఎండీసీకి బాధ్యత అప్పగింత..
ధవళేశ్వరం బ్యారేజీలో ఇసుక మేటలను తొలగించేందుకు అయ్యే వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) భరించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇసుకను తొలగించడం, దాన్ని విక్రయించడం వరకు అన్ని బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగించింది. పూడిక తీసిన ఇసుకను విక్రయించగా రూ. 256.53 కోట్ల కంటే అధికంగా ఆదాయం వస్తే.. ఆ లాభంలో వాటాలు ఏపీఎండీసీకి, సర్కార్‌ ఖజానాకు చేరుతాయి. పూడికతీతతో వచ్చే ఇసుకతో నిర్మాణరంగానికి మేలు జరుగుతుందని, కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు