ఉద్యాన రైతుకు రక్షణ కవచం

21 Jan, 2022 06:05 IST|Sakshi

నర్సరీలకు అన్నింటికీ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

సాక్షి, అమరావతి: నాణ్యతలేని విత్తనం, నర్సరీల వల్ల నష్టపోతున్న రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు రక్షణ కవచంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఏపీ ఉద్యాన నర్సరీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్టు–2010లో సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం నర్సరీలు, షేడ్‌నెట్, పాలీ హౌస్‌లతో పాటు నర్సరీ రంగంలో వ్యాపారం చేసే ప్రతీ ఒక్కరూ విధిగా లైసెన్సులు తీసుకోవాలి. వాస్తవానికి దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అధికారులు లైసెన్సు మంజూరు చేయాలి. ప్రస్తుతం ఫిబ్రవరి నెలాఖరుకల్లా రాష్ట్రంలోని నర్సరీలన్నింటికీ లైసెన్సులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నూతన చట్టం ప్రకారం వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలకూ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలు, మొక్కలు వైఎస్సార్‌ ఆర్బీకేల ద్వారా సరఫరా అవుతాయి. వీఏఏ, వీహెచ్‌ఏల సహకారంతో రైతులు రాష్ట్రంలో ఏ నర్సరీ నుంచైనా మొక్కలను బుక్‌ చేసుకొని నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

రాష్ట్రంలో 44.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా 312.34 లక్షల టన్నుల దిగుబడులొస్తున్నాయి. విత్తనాలు, మొక్కల కోసం మెజార్టీ రైతులు ప్రైవేటు నర్సరీలు, బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉన్న షేడ్‌నెట్‌లు, పాలీహౌస్‌లపై ఆధారపడుతున్నారు. రాష్ట్రంలోని 5,885 నర్సరీల ద్వారా ఏటా 422.5 కోట్ల మొలకలు ఉత్పత్తి అవుతుంటే వీటిలో 95 శాతం మిరప, టమోటా, కూరగాయలు, అరటి (టిష్యూ కల్చర్‌) పంటలవే. ఏటా రూ. 2,481.6 కోట్ల టర్నోవర్‌ సాధిస్తోన్న ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా 4.41 లక్షల మంది, పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం పరిధిలో శాశ్వత పండ్ల మొక్కల నర్సరీలు మాత్రమే ఉన్నాయి. చట్టం పరిధిలో లేని షేడ్‌నెట్‌లు, పాలీ హౌస్‌లు,  నర్సరీల్లో కొన్ని ఉత్పత్తి చేసే నాసిరకం విత్తనాల బారిన పడి రైతులు ఏటా వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. వీరి ఆగడాలకు చెక్‌ పెడుతూ రూపొందించిన నూతన చట్టం ఈ నెల18 నుంచి అమలులోకి వచ్చింది. ఇటీవలే గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది.

లైసెన్సులు ఇలా
► ఆర్బీకేల్లో ఉండే గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకుల వద్ద ఉండే దరఖాస్తు (ఫామ్‌–ఏ)తో పాటు రూ.1,000 చలనా రసీదు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకం లేదా వన్‌ బీ లేదా కనీసం మూడేళ్ల లీజు డాక్యుమెంట్, నర్సరీ లే అవుట్, ఫీల్డ్‌ మ్యాప్, సాయిల్‌/వాటర్‌ అనాలసిస్‌ రిపోర్టు, డిజిటల్‌ ఫోటోలు సమర్పించాలి
► నర్సరీలైతే తల్లి మొక్కల దిగుమతి వివరాలివ్వాలి
► షేడ్‌నెట్, పాలీహౌస్‌ నర్సరీలు ఏ కంపెనీ నుంచి ఎంత విత్తనం కొన్నారో వాటి బ్యాచ్‌ నెంబర్‌తో సహా దరఖాస్తుతో పాటు సమర్పించాలి
► స్థానిక ఉద్యానాధికారి 30 రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, తనిఖీ నివేదిక (ఫామ్‌ – బీ)ని జిల్లా ఉద్యానాధికారికి సమర్పిస్తారు. 
► 90 రోజుల్లో లైసెన్సు జారీ చేస్తారు
► లైసెన్సు కాలపరిమితి 3 ఏళ్లు. ఆ తర్వాత రూ.500 చెల్లించి దరఖాస్తు (ఫామ్‌– డీ) సమర్పిస్తే రెన్యూవల్‌ (ఫామ్‌–ఈ) చేస్తారు.
► ఉద్యానాధికారి నర్సరీలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు
► ఎక్కడైనా నాణ్యతా లోపాలుంటే లైసెన్సు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది
► లైసెన్సు పొందిన తర్వాత నర్సరీలు ఉత్పత్తి చేసే మొక్కలు, మొలకలు, ఇతర ప్లాంట్‌ మెటీరియల్‌ వివరాలు, ధరలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి
► ఒక్క మొక్క అమ్మినా రైతుకు బిల్లు ఇవ్వాలి.

చట్టం మంచిదే
చట్టం పరిధిలోకి నర్సరీలన్నింటినీ తేవడం మంచిదే. కానీ ఈ చట్టం వల్ల చిన్న రైతులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వం భరోసానివ్వాలి. చట్టంపై అవగాహన కల్పించాలి. రైతుల సందేహాలను నివృత్తి చెయ్యాలి.
– పల్లా రామకృష్ణ, పల్లా వెంకన్న నర్సరీ, కడియం, తూర్పుగోదావరి జిల్లా

నర్సరీలన్నీ చట్టం పరిధిలోకే..
ఉద్యాన రైతుకు రక్షణ కల్పించేలా ప్రస్తుతం ఉన్న చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. ఇక నుంచి నర్సరీలన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే వీలుంది. నాణ్యమైన, ధ్రువీకరించిన మొలకలు, ప్లాంట్‌ మెటీరియల్‌ను ఆర్‌బీకేల ద్వారా రైతులు పొందే అవకాశం ఉంది.
– డాక్టర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్, ఉద్యాన శాఖ కమిషనర్‌  

మరిన్ని వార్తలు