AP Bima Premium: బీమా కవరేజీలో ఏపీ ఫస్ట్‌

14 Jul, 2021 03:11 IST|Sakshi

నీతి ఆయోగ్‌ వెల్లడి.. 74.60 శాతం జనాభా కవరేజీతో తొలిస్థానం

ఆరోగ్యశ్రీని గాడిలో పెట్టిన ఫలితం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. ప్రభుత్వమే వారి తరఫున బీమా ప్రీమియం చెల్లించడం.. అలాగే, ఉచిత వైద్యం అందిస్తుండడంతో ఏపీ సర్కార్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్‌ సంస్థ ప్రకటించింది. 2020–21కి గానూ దేశవ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో ఎంతమంది బీమా కింద ఉచితంగా వైద్యం పొందుతున్నారో గణాంకాలను విడుదల చేసింది.

ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 74.60 శాతం మంది కవరేజీతో మొదటి స్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. వాస్తవానికి అంతకంటే ఎక్కువ మందే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 2,436 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స చేసేలా.. ఇన్సూరెన్స్‌ కంపెనీకి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి అమలుచేస్తోంది.

దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని ఇంత పెద్దఎత్తున ఉచిత ఇన్సూరెన్స్‌ పరిధిలోకి  తీసుకువచ్చిన దాఖలాలు ఏ రాష్ట్రంలోనూ లేవని నీతిఆయోగ్‌ స్పష్టంచేసింది. తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలే కాదు.. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ వంటి రాష్ట్రాలు సైతం ఇన్సూ్యరెన్స్‌ కవరేజీలో ఏపీతో పోటీపడలేక పోయాయి.

మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో సైతం కేవలం 15 శాతం మంది మాత్రమే కవరేజీలో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ తన తాజా గణాంకాల్లో పేర్కొంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పథకంలో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి ఎక్కువమందికి లబ్ధి కలిగేలా చేశారు. దీంతో ఇన్సూ్యరెన్స్‌ ద్వారా అధికశాతం మందికి ఉచితంగా వైద్యం చేయించుకునే వెసులుబాటు కలిగింది.

మరిన్ని వార్తలు