‘టౌన్‌’లో ప్రక్షాళన

10 Jan, 2022 04:45 IST|Sakshi

ఏ విభాగంలోనూ ఫైల్‌ పెండింగ్‌లో లేకుండా చర్యలు

క్షేత్రస్థాయి పనులపై వార్డు ప్లానింగ్‌ సెక్రటరీల పర్యవేక్షణ 

సాక్షి, అమరావతి: మునిసిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని పత్రాలున్నా ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించక విసిగెత్తిపోయే పరిస్థితులకు తెరదించి దరఖాస్తు ఏ దశలో ఉందో కిందిస్థాయి సిబ్బంది నుంచి టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఉన్నతస్థాయి అధికారుల వరకు తెలుసుకునేలా మార్పులు చేశారు. ఐదేళ్ల క్రితమే ఆన్‌లైన్‌ విధానం వచ్చినా సాఫ్ట్‌ వేర్‌ లోపాలతో కొందరు సిబ్బంది దరఖాస్తు దారు లకు చుక్కలు చూపిస్తున్నారు. మున్సిపల్‌ ఉన్నతా ధికారుల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు ఇంటిగ్రేటెడ్‌ ఆన్‌లైన్‌ డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మెనేజ్‌మెంట్‌ సిస్టం(డీపీఎంఎస్‌) లో సమూల మార్పులు చేశారు. మాన్యువల్‌ విధా నానికి స్వస్తి పలికారు. ఆన్‌లైన్‌ వల్ల దరఖాస్తు ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఏ విభాగం అధికారి వద్ద ఎన్నిరోజులు ఉందో కూడా వెల్లడి కానుంది. ఒకవేళ ఏదైనా ఫైల్‌ను నిలిపివేస్తే దరఖాస్తుదారుడికి నిర్ణీత గడువులోగా కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్‌లోనే పరిశీలన.. ఫీజుల చెల్లింపు
సాధారణంగా ఇంటి నిర్మాణం లేదా లే అవుట్‌ పనులకు టౌన్‌ ప్లానింగ్‌ నుంచి అనుమతి పొందిన తర్వాత స్థానిక అధికారులు సదరు ప్రాంతాన్ని పరిశీలించాలి. ఈ దశలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ‘పోస్ట్‌ వెరిఫికేషన్‌’ విధానాన్ని రద్దు చేశారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు పత్రాల పరిశీలన అనంతరం మాస్టర్‌ ప్లాన్‌ నిబంధనలకు లోబడి ఉంటే వెంటనే నిర్దేశించిన ఫీజు చెల్లించేందుకు అనుమతి లభిస్తుంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించగానే ఆటోమెటిక్‌గా సంబంధిత ప్లాన్‌తోపాటు నిర్మాణ ఉత్తర్వులను సైతం దరఖా స్తుదారులు డౌన్‌లోడ్‌ చేసుకునేలా మార్పులు చేశా రు. ఈ విధానం రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సం స్థలు, 18 అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో అమ ల్లోకి వచ్చింది. నిర్మాణ ప్లాన్‌ను సైతం ఆటోక్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌తో ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్‌  చేస్తున్నారు. ఈ మార్పులతో అనవసర జోక్యానికి, ఆలస్యానికి తావులేకుండా చేశారు. ఇప్పటివరకు ఉన్న పోస్ట్‌ వె రిఫికేషన్‌ విధానం, మల్టీ స్టోరీడ్‌ బిల్డింగ్‌ కమిటీలను రద్దుచేసి క్షేత్రస్థాయిలో అక్రమాలు జరగకుండా వా ర్డు ప్లానింగ్‌ సెక్రటరీల సేవలను వినియోగిం చుకుంటున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే ఆన్‌లైన్‌ విధానంలోనే నోటీసులు జారీ చేస్తున్నారు. 

15 రోజుల్లోనే అనుమతులు
టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో మార్పులు తెచ్చి అనుమతులు వేగంగా ఇస్తుండడంతో నిర్మాణ రంగానికి మేలు జరుగుతోంది,. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పత్రాలు సరిగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయి. అక్రమ నిర్మాణాలతో సమస్యలను కొని తెచ్చుకోవద్దు. అవసరమైతే అధికారులను సంప్రదించవచ్చు. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా, అనుమతులు తీసుకున్నవారు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలు పర్యవేక్షిస్తున్నారు. 
– వీపనగండ్ల రాముడు, ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు