క్లీన్‌ ఏపీకి ‘క్లాప్‌’

3 Jun, 2021 04:25 IST|Sakshi

కార్యాచరణ సిద్ధం చేసిన పురపాలక శాఖ.. మూడంచెల విధానంలో అమలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలను చెత్త రహితం చేసి స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌ లక్ష్యంగా పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ క్లీన్‌ ఏపీ (క్లాప్‌) కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టేలా మునిసిపల్‌ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. మొదటి దశలో రాష్ట్రంలోని 125 మునిసిపాలిటీల్లో అమలు చేయనున్న క్లాప్‌ కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. చెత్త సేకరణ వాహనాల సమీకరణ, కంపాక్టర్‌ బిన్స్‌ కొనుగోలు, ట్రీట్మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం టెండర్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ 34 వేల మంది పారిశుధ్య కార్మికుల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ కార్యక్రమం కోసం పురపాలక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఇంటికి మూడు డస్ట్‌ బిన్లు  ప్రతి ఇంటికి మూడు వేర్వేరు రంగుల డస్ట్‌ బిన్లను మునిసిపాలిటీలు సరఫరా చేస్తాయి. తడి, పొడి..హానికర చెత్తలను వేర్వేరుగా అందులో వేసేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. ఇందులో వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లను భాగస్వామ్యంతో మునిసిపల్‌ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి డస్ట్‌ బిన్ల కొనుగోలు చేయాలని మునిసిపాలిటీలకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రతి మునిసిపాలిటీలో ఇళ్ల సంఖ్యను బట్టి అధికారులు డస్ట్‌బిన్లను కొనుగోలు చేస్తారు. ఒక్కో డస్ట్‌బిన్‌ దాదాపు రూ.80 వరకు ఉంటుందని భావిస్తున్నారు.  అంటే ఒక్కో ఇంటికి రూ.240 వరకు ప్రాథమికంగా వెచ్చించనున్నారు. 

4వేల వాహనాలతో చెత్త సేకరణ 
చెత్తను వీధుల్లో పారబోయడం అన్నది పూర్తిగా నిషిద్ధం. మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తారు. అందుకోసం 4 వేల గూడ్స్‌ ఆటోల వంటి వాహనాలను ఉపయోగిస్తారు. ఒకొక్కటీ రూ.60వేల వరకు ఖర్చయ్యే ఆ వాహనాలను ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సమకూర్చేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టారు.  

4 వేల కంపాక్టర్‌ బిన్లు.. 122 ట్రీట్మెంట్‌ ప్లాంట్లు 
ప్రతి ఐదారు వార్డులకు ఓ కంపాక్టర్‌ బిన్‌ (కొక్కేలు గల దృఢమైన తొట్టె)లను ఏర్పాటు చేస్తారు. వాహనాల ద్వారా సేకరించిన చెత్తను ఆ కంపాక్టర్‌ బిన్లలో వేస్తారు. చెత్తను చేతితో తీయాల్సిన అవసరం లేకుండా కంటైనర్‌ వాహనాల్లోకి ఆ చెత్తను వేసి తరలిస్తారు. ఇప్పటికే 4 వేల కంపాక్టర్‌ బిన్ల కొనుగోలు కోసం పురపాలక శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. సేకరించిన చెత్తను ట్రీట్మెంట్‌ ప్లాంటకు తరలించి కంపోస్ట్‌ తయారు చేస్తారు. ఇందుకోసం రాష్ట్రం మొత్తం మీద 122 ట్రీట్మెంట్‌ ప్లాంట్లు అవసరమని పురపాలక శాఖ గుర్తించింది. ప్రస్తుతం 50 ట్రీట్మెంట్‌ ప్లాంట్లు ఉన్నాయి. మిగిలిన 72 ట్రీట్మెంట్‌ ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేటు పార్ట్‌నర్‌ షిప్‌ (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేయడం కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టారు.  

34 వేల మంది పారిశుధ్య కార్మికుల భాగస్వామ్యం 
125 మునిసిపాలిటీలలో క్లాప్‌ కార్యక్రమంలో 34 వేల మంది పారిశుధ్య కార్మికులు భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో 100 శాతం పారిశుధ్య నిర్వహణ లక్ష్యాలను సాధించేందుకు పురపాలక యంత్రాంగం సమష్టిగా సన్నద్ధమవుతోందని స్వచ్ఛ్‌ ఏపీ కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌ ‘సాక్షి’కి తెలిపారు. పట్టణాలను గార్బేజ్‌ ఫ్రీ, లిట్టర్‌ ఫ్రీ, డస్ట్‌బిన్‌ ఫ్రీ ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. 

మరిన్ని వార్తలు