‘సచివాలయాలకు’ చట్టబద్ధత తెస్తున్నాం

20 Jul, 2022 05:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

విచారణ ఆగస్టు 18కి వాయిదా

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత తెచ్చేందుకు ఓ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంక్షేమ కార్యదర్శులను పోలీసు శాఖలో అంతర్భాగం చేయడం కూడా ఈ చట్టంలో ఉంటుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో వివాదాలకు ఆస్కారం లేకుండా చట్టపరమైన పరిష్కారాలు చూపుతామన్నారు.  

ఆ వివరాలను కోర్టు ముందుంచుతామని, విచారణను ఆగస్టుకు వాయిదా వేయాలని కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ, సిలబస్, జాబ్‌ చార్ట్, సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలు ఖరారు చేస్తూ ఇచ్చిన రెండు జీవోలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు.

తమను మహిళా పోలీసులుగా పరిగణించడం సరైనదేనని, తమ వాదనలు కూడా వినాలంటూ కొందరు మహిళా సంరక్షణ కార్యదర్శులు వేసిన అనుబంధ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ చట్ట విరుద్ధ చర్యలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తరువాత తన తప్పులను సరిదిద్దుకుంటోందని తెలిపారు. అందులో భాగంగానే చట్టాలు తెస్తోందన్నారు.

మరో న్యాయవాది నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ, పోలీసు యూనిఫాం వేసుకోవాలని మహిళా కార్యదర్శులను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఇష్టం లేని వారిని మరో చోట సర్దుబాటు చేయవచ్చు కదా అని ఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. వినతిపత్రాలు సమర్పిస్తే పరిశీలిస్తామని ఏజీ చెప్పారు. దీనిపై లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలని నర్రా కోరగా ధర్మాసనం  నిరాకరించింది. మీరు వినతిపత్రాలు సమర్పించకుండా తామెలా ఉత్తర్వులు ఇవ్వగలమని ప్రశ్నించింది.  

మరిన్ని వార్తలు