స్వాధీనానికి ఒత్తిడి చేయడం లేదు

29 Oct, 2021 05:14 IST|Sakshi

స్వాధీనం చేయకపోయినా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కొనసాగుతుంది

హైకోర్టుకు తేల్చిచెప్పిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ స్వాధీనం చేయాలని ఏ విద్యాసంస్థను ఒత్తిడి చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. విద్యాసంస్థలను, సిబ్బందిని స్వాధీనం చేయకపోయినా కూడా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కొనసాగుతుందంటూ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన హామీని హైకోర్టు మరికొన్ని విద్యాసంస్థల విషయంలోనూ రికార్డ్‌ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ స్వాధీనం చేయాలని ఎవరైనా ఒత్తిడి తెస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఒత్తిడి తెచ్చినవారి వివరాలను తమ ముందుంచాలని విద్యాసంస్థల న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది.

ఒత్తిడి తెచ్చిన వారిపై చర్యలకు తాము ఆదేశాలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రైవేటుగా నిర్వహించుకోవడం లేదా వాటిని తమకు స్వాధీనం చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. 

మరిన్ని వార్తలు