AP SSC Result 2022: సప్లిమెంటరీలో పాసైనా 'రెగ్యులరే'

9 Jun, 2022 04:01 IST|Sakshi

2022 బ్యాచ్‌ టెన్త్‌ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం

విద్యార్థులకు వచ్చే మార్కుల ప్రకారం డివిజన్‌లు 

కంపార్టుమెంటల్‌ పాస్‌గా కాకుండా విద్యార్థులకు మేలు జరిగేలా చర్యలు

తప్పిన విద్యార్థులకు ఈనెల 13 నుంచి ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేక బోధన

జూలై 6 నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

తక్కువ మార్కులు వచ్చినవారికి ఇంప్రూవ్‌మెంట్‌ అవకాశం

ఎక్కువ మార్కులే పరిగణనలోకి..

సాక్షి, అమరావతి: పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయామని ఆవేదన, ఆందోళన చెందాల్సిన పనిలేకుండా రాష్ట్రంలోని టెన్త్‌ 2022 బ్యాచ్‌ విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తదుపరి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీరికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నెలరోజుల్లోనే నిర్వహించి ఫలితాలను ప్రకటించనుంది.

అంతకన్నా ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్‌ రెగ్యులర్‌ బ్యాచ్‌ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్‌ డివిజన్‌లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్‌ పాస్‌గానే పరిగణిస్తుంటారు.

ఆమేరకు ధ్రువపత్రాలు జారీచేస్తారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్‌ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే ‘కంపార్టుమెంటల్‌ పాస్‌’ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ దీనిపై ఉత్తర్వులు జారీచేయనుంది.

ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కంపార్టుమెంటల్‌గా కాకుండా రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తారు. వారు సాధించిన మార్కులను అనుసరించి ఫస్ట్‌క్లాస్, సెకండ్‌క్లాస్, థర్డ్‌క్లాస్‌లుగా డివిజన్లను ప్రకటిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్‌ ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. గ్రేస్‌ మార్కులు కలపాలని పలువర్గాల నుంచి అందుతున్న వినతులపైనా ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చించింది.

అయితే ఫెయిలైన సబ్జెక్టులకు పదివరకు గ్రేస్‌ మార్కులు కలిపినా మరో ఐదుశాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యే అవకాశముంది తప్ప అందరికీ ప్రయోజనం కలగదు. ప్రస్తుతం టెన్త్‌ ఉత్తీర్ణత శాతం 67.26 శాతం కాగా అది 73 శాతానికి చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా డివిజన్లు ఇవ్వడం వల్ల అత్యధిక శాతం మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థులు గ్రేస్‌ మార్కులతో పాస్‌ అయినట్లుగా కాకుండా సొంతంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినట్లు అవుతుందని వివరిస్తున్నారు. ఈసారి టెన్త్‌ పరీక్షల్లో 2 లక్షలమంది విద్యార్థులు ఫెయిలైన నేపథ్యంలో వారిని అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ విద్యార్థులు తప్పిన సబ్జెక్టులపై పాఠశాలల్లో ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనుంది.

సప్లిమెంటరీలో వారు తప్పనిసరిగా ఉత్తీర్ణులయ్యేలా బోధన సాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా సబ్జెక్టు టీచర్లను అన్ని స్కూళ్లలోను సన్నద్ధం చేయిస్తోంది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఈ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తప్పిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నామని అధికారులు చెప్పారు. 

20 వరకు సప్లిమెంటరీ ఫీజు గడువు 
రాష్ట్రంలో టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నారు. మంగళవారం నుంచే ఈ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఫీజు చెల్లింపు గడువు ఈనెల 20వ తేదీవరకు ఉంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిలైన వారంతా గడువులోగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎక్కువ వచ్చిన మార్కుల పరిగణన
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను.. ఉత్తీర్ణులైనవారు కూడా (ఇంప్రూవ్‌మెంట్‌ కోసం) రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పాసైనా.. తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులు, మరిన్ని మార్కులు సాధించాలనుకున్నవారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. రెండింటిలో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 

మరిన్ని వార్తలు