2 లక్షల ప్రమాద బీమా: ‘ఈ–శ్రమ్‌’లో పేర్లు నమోదు చేసుకోండి

13 Aug, 2022 03:29 IST|Sakshi

అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ 

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా  ఉచితంగా పేర్లు నమోదు

రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు

ఇప్పటికే 9.5 లక్షల మంది పేర్లు నమోదు

అర్హులందరి పేర్లు నమోదుకు ఈ నెల 17, 18 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్‌ 

ఇప్పటికే రాష్ట్రంలో 1.21 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: చేతి వృత్తిదారులు, చిరు వ్యాపారులు, వ్యవసాయ, వలస కూలీలు సహా అన్ని రకాల అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈ–శ్రమ్‌’ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అర్హులందరి పేర్లు నమోదుకు ఈ నెల 17, 18 తేదీల్లో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఈ– శ్రమ్‌ పథకంలో పేర్లు నమోదు చేసుకునే వారు రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందుతారని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు కలిగిన దాదాపు 1.21 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది.

కాగా రాష్ట్రంలోని పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల పేర్లను ఈ – శ్రమ్‌ పోర్టల్‌లో ఉచితంగా నమోదు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా మిగతా అర్హులందరి పేర్లు పోర్టల్‌లో నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్‌ సాగిలి షాన్‌మోహన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

వలంటీర్ల భాగస్వామ్యం
ఉపాధి హామీ పథకంలో కూలీలు పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు అసంఘటిత కార్మికుడిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేసుకోవడంలో వలంటీర్లను భాగస్వాములను చేశారు. వలంటీర్లు వారి పరిధిలో అర్హులను గుర్తించి 17, 18 తేదీల్లో జరిగే ప్రత్యేక శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు.

23, 24 తేదీల్లో స్కూళ్లలో ఆధార్‌ క్యాంపులు
గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో పలు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహించనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తెలిపింది. గత రెండు నెలలుగా ప్రతి నెలా రాష్ట్రంలోని సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పాఠశాలల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు