Andhra Pradesh: పెట్టుబడుల ప్రవాహం

22 Aug, 2022 03:02 IST|Sakshi

2022 ప్రథమార్ధంలో రూ.20,682 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి

2020 జనవరి నుంచి 2022 జూన్‌ వరకు రూ.40,872 కోట్ల పెట్టుబడులు సాకారం 

రెండున్నరేళ్లలో కొత్తగా 129 యూనిట్ల ద్వారా రూ.24,956 కోట్ల పెట్టుబడులు

కేంద్ర డీపీఐఐటీ తాజా గణాంకాల్లో వెల్లడి

ఎంఎస్‌ఎంఈలతో కలిపి మూడేళ్లలో 28,343 యూనిట్లు ప్రారంభం

2.48 లక్షల మందికి ఉపాధి

చర్చల దశలో మరో రూ.2.50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు 

‘ఉదయం’ పోర్టల్‌లో ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదు

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్‌ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో పారిశ్రామికాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన యూనిట్లను త్వరితగతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెలా రాష్ట్రంలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది సత్ఫలితాలనిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు అంటే ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలో 22 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా వీటి ద్వారా రూ.20,682 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ తన తాజా నివేదికలో వెల్లడించింది. తొలి ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించిన ప్రధాన కంపెనీల్లో గ్రాసిం ఇండస్ట్రీస్, పానాసోనిక్‌ లైఫ్‌ సైన్స్‌సొల్యూషన్స్, కాప్రికాన్‌ డిస్టిలరీ, ఆంజనేయ ఫెర్రో అల్లాయిస్, నోవా ఎయిర్, తారక్‌ టెక్స్‌టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్‌ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్‌ మిల్‌ లాంటివి ఉన్నాయి.

కోవిడ్‌ సంక్షోభం కుదిపివేసిన 2020, 2021తో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో రెట్టింపు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2019లో 42 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.9,840 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా 2021లో రూ.10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత రెండున్నరేళ్లలో మొత్తం 111 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా మొత్తం రూ.40,872 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 

పూర్తి స్థాయిలో చేయూత
పారిశ్రామికవేత్తల నుంచి కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందిన నాటి నుంచి యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో చేయూత అందించేలా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇదే విషయాన్ని పలు కంపెనీల ప్రతినిధులు స్వయంగా ప్రకటించడమే కాకుండా రెండో దశ విస్తరణ పనులకు కూడా శ్రీకారం చుట్టడం తెలిసిందే. తాజాగా విశాఖ వద్ద ప్రముఖ జపాన్‌ కంపెనీ యకహోమా గ్రూపు సంస్థ ఏటీసీ టైర్స్‌ యూనిట్‌ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో నితిన్‌ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటును కొనియాడారు.

సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందని, రాష్ట్రంలో మాత్రం సింగిల్‌ డెస్క్‌ విధానంలో వేగంగా మంజూరయ్యాయని తెలిపారు. దీంతో రికార్డు సమయంలో 15 నెలల్లోనే తొలిదశ యూనిట్‌ను ప్రారంభించడమే కాకుండా రెండో దశ పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిచినట్లు నోవా ఎయిర్‌ ప్రతినిధులు ‘సాక్షి’కి వెల్లడించారు. 2020 డిసెంబర్‌లో నిర్మాణం ప్రారంభించి 11 నెలల్లోనే పనులు పూర్తి చేశామని, దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

సులభతర వాణిజ్యంలో మూడో ఏడాదీ మొదటి స్థానం
గత రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా రూ.24,956 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ నివేదిక పేర్కొంది. 2020 జనవరి నుంచి 2022 జూన్‌ నాటికి కొత్తగా 129 భారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా  ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరునెలల కాలంలో కొత్తగా 23 కంపెనీలు రూ.5856 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్‌ డెస్క్‌ విధానంలో అన్ని అనుమతులు ఆన్‌లైన్‌ ద్వారా మంజూరు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాదీ ఏపీ మొదటి స్థానంలో నిలబడటం దీనికి నిదర్శనమని తెలిపారు.

ఎంఎస్‌ఎంఈలతో కలిపి 28,343 యూనిట్లు ప్రారంభం
భారీగా ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తూ అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ.47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 28,247 ఎంఎస్‌ఎంఈలు ఉండగా 96 భారీ యూనిట్లు ఉన్నాయి.

ఇవి కాకుండా మరో రూ.1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్‌ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. ఇవి కాకుండా సుమారు రూ.2.50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు