రైతుల మేలు కోరు‘కొనేలా’..

11 Feb, 2022 06:13 IST|Sakshi

కర్షకుల చెంతకే బడా కంపెనీలు 

ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ–ఫారమ్‌ విధానం  

దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టేందుకు కృషి  

ఇప్పటికే మిర్చి, వరి, పత్తి, శనగ, మినుము పంటలకు బడా కంపెనీల ఆర్డర్లు 

మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో కాల్‌ సెంటర్, అధికారుల మధ్యవర్తిత్వం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అడ్డగోలుగా దోచేసే దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం కొనుగోళ్లలో పారదర్శకత, రైతులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా ఈ–ఫారమ్‌ పేరుతో ఓ సరికొత్త జాతీయ స్థాయి మార్కెటింగ్‌ వసతి ఏర్పాటు చేయనుంది. వ్యాపారులే నేరుగా రైతుల నుంచి పంట కొనుగోలు చేసేలా, అందుకు అధికారులు మధ్యవర్తిత్వం వహించేలా ఓ కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన జిల్లాల్లో ఇప్పటికే మార్కెటింగ్‌ శాఖ రైతుల వివరాలు సేకరిస్తోంది. 

జాతీయ స్థాయి మార్కెటింగ్‌ సౌకర్యం... 
పంటలు పండించడం ఒక ఎత్తయితే.. పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడం రైతులకు మరో సవాల్‌. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ మార్కెట్‌ విధానంలో వ్యాపారులకు, రైతులకు మధ్యలో దళారి వ్యవస్థ రైతులను నిలువునా ముంచుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఈ–ఫారమ్‌ అనే నూతన మార్కెటింగ్‌ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. ఈ విధానం కింద వ్యాపారులే నేరుగా రైతుల వద్ద నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు, వ్యాపారులకు మధ్యలో మార్కెటింగ్‌శాఖ అధికారులు మధ్యవర్తిత్వం వహిస్తారు. జిల్లాలో ఎంత మంది రైతులు ఉన్నారు.. వారు ఏఏ పంటలు సాగు చేశారు.. వారి వద్ద ఉన్న ఉత్పత్తులు ఏంటి.. ఎంతమేర ఉన్నాయి.. అనే వివరాలను మార్కెటింగ్‌శాఖ అధికారులు సేకరిస్తారు.

తరువాత ఆ వివరాలను నేరుగా కార్పొరేట్‌ కంపెనీలు, బడా వ్యాపారులకు అందిస్తారు. వ్యాపారులు వారి అవసరాల మేరకు రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఉత్పత్తులను కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పటి వరకు జిల్లాలో 3.50 లక్షల రైతులు,  పంట ఉత్పత్తుల వివరాలను మార్కెటింగ్‌శాఖ అధికారులు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారం నడిపించేందుకు నాగార్జున ఫెర్టిలైజర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌జీఎల్‌)ను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా ఎంపిక చేశారు. త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం ఈ –ఫారమ్‌ వ్యవస్థ వెబ్‌సైట్‌ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. ఈ వెబ్‌సైట్‌లో రైతులు నేరుగా తమ ఉత్పత్తుల వివరాలను నమోదు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 

భారీగా ఆర్డర్లు... 
ఈ–ఫారమ్‌ విధానంలో ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు బడా కంపెనీలు, వ్యాపారులు ముందుకు వస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలు బడా కంపెనీలు ఇప్పటికే తమకు కావాల్సిన ఉత్పత్తుల వివరాలను మార్కెటింగ్‌శాఖ అధికారులకు ఇచ్చారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా పచ్చి మిర్చి 80 టన్నులు, ఎండు మిర్చి 25 టన్నులు, ధాన్యం 3 వేలు టన్నులు, పత్తి 15 టన్నులు రైతుల నుంచి సింగపూర్‌కు ఎక్స్‌పోర్టు జరిగింది. మరో రూ.200 కోట్లు విలువ గల మిర్చి, ధాన్యం, పత్తి, కందులు, శనగలు, మినుములు, పెసలు కావాలని బడా కంపెనీల నుంచి ఆర్డర్లు ఇచ్చారు. జిల్లాలో అత్యధికంగా మిర్చి, వరి, పత్తి, కందులు, శనగలు, మినుములు, జొన్న, మొక్కజొన్న, పెసర వంటి పంటలు పండుతుండడంతో వీటికి మార్కెట్‌ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో.. 
రాష్ట్రంలోని గుంటూరు, అనంతపురం, కర్నూలు, కృష్ణా, ప్రకాశం జిల్లాలను ఈ పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఈ–ఫారమ్‌ విధానాన్ని అమలు చేయడంలో మిగిలిన జిల్లాలతో పోల్చితే ముందు వరసలో ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు మార్కెటింగ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.  

కంట్రోల్‌ రూం ఏర్పాటు... 
ఈ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు చుట్టుగుంట సెంటర్‌లోని మార్కెటింగ్‌శాఖ కార్యాలయంలోనే ఓ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి రైతులు తమ పేర్లు, ఉత్పత్తులను నమోదు చేసుకోవచ్చు.  

ఆన్‌లైన్‌ ట్రేడ్‌లో గుంటూరు జిల్లా ప్రథమ స్థానం... 
పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన జిల్లాల్లో ఈ–ఫారమ్‌ విధానం అమలు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా ఇప్పటికే  రైతుల నుంచి నేరుగా బడా కంపెనీలు కొనుగోలు చేసి సింగపూర్‌కు ఎక్స్‌పోర్టు చేశారు. ఈ–ఫారమ్‌ విధానంతో రైతులకు మార్కెటింగ్, ధరల పరంగా లాభం చేకూరనుంది. 
–బి.రాజాబాబు, ఏడీ మార్కెటింగ్‌శాఖ  

ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం మంచిదే..  
రైతుల పంట ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం శుభపరిణామం. వాణిజ్య పంటలు పండించే రైతులకు ఈ విధానం కచ్చితంగా మేలు చేస్తుంది. అయితే దేశంలోని అన్ని కంపెనీలు, వ్యాపారులను ఈ విధానంలోకి ప్రభుత్వం తీసుకురావాలి. దీంతో మధ్య దళారీ వ్యవస్థ పూర్తిగా నశించిపోతుంది.  
– భవనం జయరామిరెడ్డి, అభ్యుదయ రైతు 

మరిన్ని వార్తలు