మైనింగ్‌ ఆధారిత ఇండస్ట్రీకి తోడ్పాటు

29 Jun, 2021 03:51 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రులు పెద్దిరెడ్డి, మేకపాటి

రాష్ట్రంలో సిలికాశాండ్, డోలమైట్, లైమ్‌ నిల్వలు పుష్కలం 

గ్లాస్‌ తయారీ పరిశ్రమలకు కీలక ఖనిజాలు మన సొంతం

భారీ గ్లాస్‌ తయారీ పరిశ్రమలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి

మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఖనిజ వనరులను వినియోగించుకుంటూ ఏర్పాటు చేసే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని మైనింగ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సిలికాశాండ్‌ను వినియోగించుకుని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే కంపెనీలను ప్రోత్సహిస్తామన్నారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో గ్లాస్‌ పరిశ్రమలకు ఉపయోగించే సిలికాశాండ్‌ నిల్వలు ఉన్నాయని, అలాగే డోలమైట్, లైమ్‌ ఖనిజ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. వాటిని వినియోగించుకునేందుకు పలు భారీ పరిశ్రమలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని అత్యంత సరళం చేస్తూ, పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దీనికి అనుగుణంగా అధికారులు కూడా పరిశ్రమలకు తోడ్పాటు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని డోలమైట్, లైమ్, సిలికాశాండ్‌ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ వనరుల లభ్యతపై మంత్రులు సమీక్షించారు. గనులశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం జవ్వాది, భూగర్భగనులశాఖ డైరెక్టర్‌ (డీఎంజీ) వి.జి.వెంకటరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ రవిచంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు