కష్టకాలంలో కంటికి రెప్పలా!

22 Sep, 2022 06:40 IST|Sakshi
2020 ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్‌ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆదుకుంది (వ్యయం రూ.కోట్లలో)

 కోవిడ్‌ వేళ ప్రజల చేతికి నగదు అందించి ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారి ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చాలా స్పష్టంగా కనిపిస్తోందని, లాక్‌డౌన్‌ కాలంలో వ్యవసాయం మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని  కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. అయితే కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పధకాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలను ఆదుకుందని తెలిపింది.

2020 – 21 ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్‌లో 6.60 శాతం, మే నెలలో 17.85 శాతం మేర రెవెన్యూ రాబడులు తగ్గిపోయినప్పటికీ అదే సమయంలో మచ్చుకు 8 పథకాల ద్వారా రూ.16,410.12 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సాయం అందించిందని పేర్కొంది. 2020–21లో జాతీయ వృద్ధి తిరోగమనంలో ఉండగా ఏపీ మాత్రం 1.58 శాతం వృద్ధి సాధించినట్లు నివేదిక తెలిపింది. 2020–21లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనా«థ్‌ బుధవారం శాసన సభకు సమర్పించారు. కాగ్‌ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ...

► కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న 2020–21లో ఆంధ్రప్రదేశ్‌ రూ.9,86,611 కోట్ల జీఎస్‌డీపీని నమోదు చేసింది. గతంలో రాష్ట్రం ఏటా పది శాతానికి పైగా వృద్ధి రేటు సాధించగా కోవిడ్‌ కారణంగా 2020–21లో మాత్రం 1.58 శాతం వృద్ధి రేటు నమోదైంది.

► కోవిడ్‌తో ఆర్థిక సంక్షోభం వల్ల వ్యవసాయం మినహా మిగిలిన రంగాలు దెబ్బతిన్నాయి. గతంతో పోలిస్తే 2020–21లో నెలవారీ రెవెన్యూ రాబడులు తగ్గిపోయి వ్యయం పెరిగింది.

► రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2020 ఏప్రిల్‌లో 6.60 శాతం, మే నెలలో 17.85 శాతం తగ్గాయి. పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న జూన్, జూలై, అక్టోబర్‌లో మాత్రం పన్ను బదిలీలతో రాబడులు పెరిగాయి. కోవిడ్‌తో పోరాడేందుకు కేంద్రం నుంచి రూ.580.25 కోట్ల గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొందింది.

► వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ పద్దుల కింద కోవిడ్‌ సహాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.337.25 కోట్ల రెవెన్యూ వ్యయం చూపించింది. 2020 ఏప్రిల్, మే ఆదాయ వ్యయాలను విశ్లేషించగా ఆ రెండు నెలల్లోనే కోవిడ్‌ మహమ్మారి సమయంలో లబ్ధిదారులకు సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టినట్లు స్పష్టం అవుతోంది. జాతీయ ఆరోగ్య మిషన్,  రాష్ట్ర విపత్తుల నిధి నుంచి రెండు నెలల్లోనే రూ.1,343.28 కోట్లు ఖర్చు చేసింది.

► కోవిడ్‌తో 2020–21లో జాతీయ జీడీపీ వృద్ధి రేటు తిరోగమనంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీలో వృద్ధి సాధించింది. దేశ జీడీపీ –2.97 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ వృద్ధి రేటు 1.58 శాతంగా ఉంది.

వృద్ధి రేటు తగ్గుదలకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో పరిశ్రమలు, సేవా రంగాలు కుదేలు కావడమే కారణం. ఉద్యాన పంటల వృద్ధితో 2020–21లో వ్యవసాయ రంగం 8.80 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. అనంతరం పశుగణన, మత్స్య శాఖల్లో గణనీయమైన వృద్ది జరిగింది. వ్యవసాయ మినహా మిగతా రంగాల్లో వృద్ది రేటు తక్కువగా నమోదైంది. 

మరిన్ని వార్తలు