'సుగ్గి' శానా తగ్గింది!

21 Nov, 2022 04:35 IST|Sakshi

ఆదోని డివిజన్‌లో గతంలో ఏటా 2 లక్షల మంది వలస

మూడేళ్లుగా 90 శాతం ఆగిపోయిన వలసలు

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో బీడు భూములు కళకళ

మంత్రాలయంలో ఐదు ఎత్తిపోతలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం 

సమృద్ధిగా వర్షాలు, నీటి సౌలభ్యంతో పుష్కలంగా పంటలు

వైపరీత్యాలతో నష్టపోతే పంటల బీమాతో అండగా సర్కారు 

సొంతూరిలో సేద్యం చేసుకుంటూ ఆనందంగా రైతన్నలు

ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు

సాక్షి ప్రతినిధి, కర్నూలు: మూడేళ్లుగా మంచి వర్షాలు.. పచ్చని పంటలు.. పండిన పంటకు గిట్టుబాటు ధర.. వైపరీత్యాలతో నష్టపోతే పంటల బీమాతో అండగా నిలుస్తున్న సర్కారు.. విత్తనం నుంచి విక్రయం వరకూ రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ భరోసా కల్పిస్తుండటంతో వలసలు ఆగిపోయి కరువు సీమ కళకళలాడుతోంది. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 381 పంచాయతీల్లో చాలా గ్రామాల్లో గతంలో ఏటా 2 లక్షల మందికిపైగా పనుల కోసం ‘సుగ్గి’ (వలస) వెళ్లేవారు. మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారింది.

వలస వెళ్లేవారి సంఖ్య 90 శాతానికి పైగా తగ్గింది. అక్కడక్కడా కొన్ని పల్లెల్లో వెళుతున్నా పనుల్లేక మాత్రం కాదు. తమ పొలాల్లో పనులు పూర్తి చేసుకుని మిగతా రోజుల్లో ఎక్కువ కూలీ వస్తుందనే ఉద్దేశంతో గుంటూరు జిల్లాతోపాటు తెలంగాణ ప్రాంతానికి పత్తి చేలలో పనులకోసం వెళుతున్నారు. స్థానికంగా రోజుకు రూ.300 చొప్పున కూలీ లభిస్తుండగా తెలంగాణ, గుంటూరులో పత్తి తీస్తే కిలోకు రూ.14 చొప్పున చెల్లిస్తున్నారు.

ఒక వ్యక్తి రోజుకు క్వింటం నుంచి 120 కిలోలు పత్తి తీస్తారు. దీంతో రూ.1,400–1,680 వరకు కూలీ రావడంతో పనులు లేని సమయాల్లో వెళ్లి వస్తుంటారు. ఇక కర్ణాటక, కేరళ వలస వెళ్లేవారి సంఖ్య పూర్తిగా ఆగిపోయింది. కోసిగి, పెద్దకడుబూరు, నందవరం, మంత్రాలయం, ఎమ్మిగనూరుతో పాటు పలు మండలాలను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించగా కేరళ, కర్నాటకకు వలసవెళ్లిన కుటుంబం ఒక్కటీ కనిపించలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఇది స్పష్టం చేస్తోంది.

నిశ్చింతగా సాగు
ఆదోని డివిజన్‌లో 2.5 ఎకరాల లోపు ఉన్న రైతులు 60% మంది, ఐదెకరాలలోపు ఉన్నవారు 29 శాతం మంది ఉన్నారు. ఇక్కడి భూములన్నీ వర్షాధారమే. కర్నూలు జిల్లాలో 2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 2.84 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.339.60 కోట్లు జమ అయ్యాయి. ఈ ప్రాంతంలో పత్తి, ఉల్లి, మిరప అధికంగా సాగు చేస్తారు.  ఐదేళ్లక్రితం 2 లక్షల ఎకరాల్లో సాగైన పత్తిని ఈ ఏడాది 7 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. 

అక్షరాస్యతలో అట్టడుగున..
కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఆదోని డివిజన్‌ అభివృద్ధితోపాటు అక్షరాస్యతలో అత్యంత వెనుకబడి ఉంది. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండల జనాభా (2011 లెక్కల ప్రకారం) 69,275 కాగా అక్షరాస్యత 28.4 శాతం మాత్రమే. నిరక్షరాస్యతలో రాష్ట్రంలో మొదటి స్థానం, దేశంలో మూడో స్థానంలో ఉండే మండలం కూడా ఇదే.  అయితే ఇప్పుడు అమ్మఒడి, జగనన్న విద్యా కానుక లాంటి పథకాల వల్ల పిల్లలను చదివించుకోవాలన్న తపన ప్రతి ఒక్కరిలో నెలకొంది. పల్లెల్లో ప్రతి చిన్నారి బడిబాట పట్టారు.

ఆదోని అభివృద్ధికి ‘ఆడా’ 
ఆదోని డివిజన్‌ వెనుకబాటుతనాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడా’ (ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు చేస్తూ 2022 జనవరి 12న జీవో నెంబర్‌ 7 జారీ చేసింది. ఆదోని, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు పరిధిలోని 381 పంచాయతీలను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసింది. అందరికీ భూమి కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పం. 

ఎత్తిపోతలతో సస్యశ్యామలం
మంత్రాలయం నియోజకవర్గంలో ఐదు ఎత్తిపోతలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  హోలి, ఐరనగల్లు, కందుకూరు, కగ్గల్లు, బసాపురం ఎత్తిపోతల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇవి పూర్తయితే 10 వేల ఎకరాలకు సాగునీరు, 20 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పులికనుమ రిజర్వాయర్‌కు ఇప్పటికే తుంగభద్ర నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని పరిధిలో 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. గురు రాఘవేంద్రతో పాటు దిద్ది, మాధవరం, బసలదొడ్డి, వగురూరు ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే సాగునీరు అందుతోంది. ఆర్డీఎస్, వేదవతి పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.  

జన్మలో సూడలే..
నాకు ఆరెకరాల పొలం ఉంది. 9 మంది పిల్లలు. 8 మంది ఆడబిడ్డలే. ఒక పాపోడు. 14 ఏళ్ల కిందట నా భర్త చనిపోవడంతో పొలం సూసు కుంటా బతుకుతాండా. ఏం గిట్టుబాటు కాలే. ఆరెకరాల్లో మిరప, ఉల్లి ఏసినా. తెగుళ్లతో పంట రాలే. ఏం అర్థకాకుండా ఉంటి. సీఎం జగన్‌ రూ.2.07 లక్షలు బీమా డబ్బులు అకౌంట్లో ఏసినాడు. నా జన్మలో ఎప్పుడూ ఇంత బీమా సొమ్ము సూడలే. ఆ డబ్బుతో బోరు వేయించుకున్నా. నీళ్లు పడినాయి. వాన వచ్చినా, రాకున్నా నీళ్లకు దిగుల్లే. నిబ్బరంగా పంట ఏత్తా.. ఇంకో ఇషయం సారూ. నాకు ఏటా రైతుభరోసా లెక్క కూడా పడతాంది.
– హంపమ్మ, చింతకుంట

భయం లే!
నాకున్న నాలుగెకరాల్లో మిరప, ఉల్లి వేసినా. పంట దెబ్బతింది. కొంత చేతికొచ్చింది. రూ.81 వేలు బీమా వచ్చింది. నా జీవితంలో ఇంత బీమా సొమ్ము ఎప్పుడూ రాలే. ఇంత లెక్క రావడం ఇదే ఫస్టు. తెగుళ్లు వచ్చి పంట పోయిందనే దిగుల్లేదు. మల్లా ధైర్యంగా పంట ఏత్తా. దేవుని దయతో పండితే పంట వత్తాది.. లేకపోతే దిగుల్లేకుండా బీమా లెక్క వత్తాది. రైతు భరోసా కూడా వత్తాది. అప్పుడు మాదిరి భయం లే!
– సుంకయ్య, చింతకుంట, కోసిగి మండలం 

మరిన్ని వార్తలు