మద్యం షాపుల్లో అక్రమాలకు చెక్‌

27 Jun, 2021 03:34 IST|Sakshi

ప్రతి దుకాణంలో సీసీ కెమెరా.. జిల్లా కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం

విక్రయ వ్యక్తి నుంచి సెక్యూరిటీలు.. ప్రతి నెలా ఆడిట్‌

దుకాణం దగ్గర స్థానిక ఎక్సైజ్‌ అధికారి ఫోన్‌ నంబర్‌

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు

సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ(ఎక్సైజ్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇటీవల ఏపీ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను జిల్లా కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. తద్వారా మద్యం దుకాణాల్లో విక్రయాలు సజావుగా జరుగుతున్నాయా, లేదా అనే విషయాన్ని జిల్లా కంట్రోల్‌ రూమ్‌ల నుంచి పర్యవేక్షిస్తారు. విక్రయాల్లో ఏదైనా అవకతవకలు జరిగితే ఆ విషయం సీసీ కెమెరాల ద్వారా తెలిసిపోతుంది. మద్యం బాటిల్స్‌ లేబుల్స్‌ను తప్పనిసరిగా స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే దుకాణాల్లో మద్యం విక్రయించే వ్యక్తుల నుంచి రెండు సెక్యూరిటీలను తీసుకోనున్నారు.

ఒకవేళ ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగితే.. విక్రయించే వ్యక్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల్లోని లావాదేవీలను ప్రతి నెలా ప్రత్యేకంగా ఆడిట్‌ నిర్వహిస్తారు. సంబంధిత నోడల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్స్‌ క్రమం తప్పకుండా దుకాణాలను తనిఖీ చేయాలి. ఏమైనా అక్రమాలు జరిగితే తెలియజేసేందుకు వీలుగా మద్యం దుకాణాల వద్ద స్థానిక ఎక్సైజ్‌ అధికారి ఫోన్‌ నంబర్‌ను తప్పనిసరిగా ఉంచాలి. మద్యం విక్రయించే వ్యక్తులు ఎవ్వరైనా తప్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానం వస్తే.. వారిని బదిలీ చేయనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా ఇప్పటికే 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించింది.

43 వేల బెల్ట్‌ షాపులను రద్దు చేసింది. అలాగే పర్మిట్టు రూమ్‌లను రద్దు చేసింది. ప్రత్యేకంగా మద్యం అక్రమాలను అరికట్టేందుకు, మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అక్రమ మద్యం వ్యవహారాలను నిరోధించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే అక్రమ మద్యం వ్యవహారాలకు సంబంధించి 15 వేల కేసులు నమోదు చేశారు. తాజాగా మద్యం దుకాణాల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది.  

మరిన్ని వార్తలు