గంజాయి.. ఇక గతమే

15 Feb, 2022 03:53 IST|Sakshi
గంజాయిని ధ్వంసం చేస్తున్న అధికారులు, గిరిజనులు

మన్యంలో గంజాయి సాగును పూర్తిగా తుడిచిపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు

విరివిగా ప్రోత్సాహకాలు 

మూడేళ్లలో రూ.144 కోట్ల వ్యయం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతేడాది వరకు గంజాయి పండించిన పొలాలు ఉద్యాన పంటల క్షేత్రాలుగా మా రుతున్నాయి. గిరి శిఖరాల నడుమ మారుమూలన ఉండే ఆ పొలాల్లో ఇప్పుడు విదేశీ కూరగాయలతో పా టు కాఫీ, పసుపు, స్ట్రాబెర్రీ వంటి పంటలు పురుడు పో సుకుంటున్నాయి. గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడమే కాకుండా ఆ పొలాల్లో ఉద్యాన పంటలు పండించేలా గిరిజనులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయానికి అనుగుణంగా.. లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ సాగువైపు అడుగులు పడుతున్నాయి. గిరిజనులకు ప్రోత్సాహకాలందిస్తూ.. వాణిజ్య పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

అప్పటి పాలకులు పట్టించుకోక..
మన్యంలో గిరిజనులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వంటి పరిస్థితుల్లో అక్కడి గిరిజన రైతుల్లో కొం దరు గంజాయి సాగువైపు ఆకర్షితులయ్యారు. అలా విశాఖ మన్యంలో గంజాయి సాగు సుమారు 10 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించింది. ఎట్టిపరిస్థితుల్లో గంజా యి సాగుపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం రంగంలోకి దిగింది.  

ఫలితంగా గతేడాది వరకు సగటున 10 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి పంట రెండేళ్లలో 7 వేల ఎకరాలకు పడిపోయింది. పోలీసులు, సెబ్, ఐటీడీఏ, సచివాలయ సిబ్బంది డ్రోన్ల సహాయంతో గంజాయి సాగును గుర్తించి..  ఆ భూముల్లో ప్రత్యామ్నాయ  పంటల సాగును ప్రోత్సహించకపోతే తిరిగి గంజాయి వైపు గిరి జనులు మొగ్గుచూపే ప్రమాదం ఉండటంతో మూడేళ్లలో లక్షకు పైగా ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సా గు చేపటేఊ్టలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా 62 వేల మంది గిరిజనులకు 98 వేల ఎకరాలను ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల ద్వారా అందించి ఆ భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పిం చింది. వీటితో పాటు గంజాయి సాగైన 7 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేయిస్తోంది.

శిక్షణ ఇచ్చి మరీ..
వాణిజ్య పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు సాగు రీతులు, సస్యరక్షణపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించేలా ప్రభుత్వం చేర్యలు చేపట్టింది. ముఖ్యంగా వేరుశనగ, రాజ్‌మా, రాగులు వంటి పంట లతో పాటు డ్రాగన్‌ ఫ్రూట్, లిచీ, పైనాపిల్, అవకాడో, స్ట్రాబెర్రీ, అల్లం, నల్ల మిరియాలు, పొద మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంప, టమోటా, కాకర, బీర, బెండ వంటి ఉద్యాన పంటలను 46,650 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు రానున్న రెండేళ్లలో 34 వేల ఎకరాల్లో కాఫీ గింజల సాగుకు సన్నద్ధం చేయాలని అధికారులు భావి స్తున్నారు. మరో 5 వేల ఎకరాల్లో రూ.100 కోట్లతో పసుపు పండించనున్నారు.

గిరిజనుల ఆర్థికాభివృద్ధికి రూ.144 కోట్లు
ప్రతి గిరిజనుడు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా మూడేళ్లకు అభివృద్ధి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇందుకోసం  రూ.144 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.  

స్వచ్ఛందంగా సాగు వైపు..
ప్రభుత్వం చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంతో గిరిజనులు ఈ ఏడాది స్వచ్ఛందంగా గంజాయి సాగును విడనాడారు.  ప్రభుత్వం కేవలం ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి చేతులు దులిపేసుకోకుండా.. గిరిజన రైతులకు పూర్తిస్థాయి సహకారం అందించాలని నిర్ణయించింది. విత్తనాలు సరఫరా చేయడంతోపాటు పంట చేతికి వచ్చేంత వరకు సహకారం అందిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి గోపాలకృష్ణ తెలిపారు.  జామ్, జ్యూస్‌గా మార్చడం, పల్పింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి పనులు చేపట్టేలా  వారిని ప్రోత్సహిస్తామన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా.. పంట ఆదాయం చేతికొచ్చేంత వరకూ గిరిజన రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు