పరిశ్రమలకు 'పవర్‌' ఫుల్‌ 

19 May, 2022 03:56 IST|Sakshi

అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసిన ప్రభుత్వం

నిరంతర సరఫరా పునరుద్ధరించిన డిస్కమ్‌లు

దేశవ్యాప్తంగా ఇంకా సమస్యలున్నా రాష్ట్రంలో ఊరట

ప్రస్తుతం రోజూ 195.26 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ 

గృహ విద్యుత్‌కు ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటూ ఇటీవల పరిశ్రమలకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాపై విధించిన అన్ని ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించింది. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ సరఫరాను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కొరత ఇంకా కొనసాగుతున్నా, రాష్ట్రంలో నిత్యం 195.26 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నెలకొన్నప్పటికీ పరిశ్రమల మనుగడ, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచే పరిశ్రమలపై ఆంక్షల ఎత్తివేత వర్తిస్తుందని ఏపీఈఆర్‌సీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

బొగ్గు కొరత, ఎండలతో..
వేసవి ఉష్ణోగ్రతల ప్రభావంతో గత నెల ప్రారంభంలో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ దాదాపు 235 మిలియన్‌ యూనిట్లకు చేరింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ధర్మల్‌ విద్యుదుత్పత్తిలో సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పవర్‌ ఎక్ఛ్సేంజీల్లో యూనిట్‌ ధర రూ.16 నుంచి రూ.20 వరకూ పెరిగింది. ఫలితంగా సరఫరా తగ్గి కోతలు అనివార్యమయ్యాయి.

తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమల విద్యుత్‌ వినియోగంపై నియంత్రణ విధించాల్సి వచ్చింది. డిస్కమ్‌ల అభ్యర్ధన మేరకు పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్‌ హాలిడే అమలు చేస్తూ ఏపీఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.  

సీఎం ఆదేశాలతో..
మే 9న పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఎత్తివేసి ప్రభుత్వం ఊరట కలిగించింది. నిరంతరం నడిచే పరిశ్రమలు 70 శాతం విద్యుత్‌ వాడుకోవడానికి అనుమతిచ్చింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ ఈ నెల 13న ఏపీఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది.  ఈ నెల 15 తరువాత పరిశ్రమలపై ఆంక్షలను పొడిగించలేదు.

పరిశ్రమలకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని, ఆంక్షలను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల విద్యుత్తు సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని ఆంక్షలు, నియంత్రణలను తొలగించడంతో పరిశ్రమలకు పూర్తి స్థాయిలో ఊరట లభించింది. వ్యవసాయం, గృహ విద్యుత్‌ అవసరాలకు కోతలు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యుత్తు సరఫరా జరుగుతోంది.  

మరిన్ని వార్తలు