AP: ప్రధాన ఆలయాలకు మాస్టర్‌ ప్లాన్లు

16 Apr, 2022 04:09 IST|Sakshi

వాటి ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు

ఆలయం చుట్టూ ప్రైవేట్‌ స్థలం సమీకరణ

అటవీ ప్రాంతంలోని ఆలయాలు సమీపంలోని ప్రధాన రహదారులతో అనుసంధానం  

తొలిదశలో 17 ప్రధాన ఆలయాల ఎంపిక

మాస్టర్‌ప్లాన్ల రూపకల్పనకు రెండు ప్రముఖ సంస్థల ఎంపిక

ఈ నెలాఖరులో సీఎం ఆధ్వర్యంలో సమీక్ష!

సాక్షి, అమరావతి: తిరుమల తరహాలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల పరిసరాలన్నింటినీ సాధ్యమైనంత విశాలంగా, భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర దేవదాయ శాఖ వాటన్నింటికీ మాస్టర్‌ ప్లాన్లను రూపొందించాలని సంకల్పించింది. భవిష్యత్తులో ఏదేని ఆలయం చుట్టుపక్కల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మాస్టర్‌ ప్లాన్‌లో డిజైన్‌ చేసుకున్న దాని ప్రకారమే చేపడతారు. భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైతే ఆలయం పరిసరాల్లో అదనంగా భూమి సేకరించాలన్న విషయాన్నీ ఈ మాస్టర్‌ ప్లాన్‌లో ముందుగా అంచనా వేస్తారు.

అలాగే.. అటవీ, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రధాన ఆలయాలను సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానం చేసేలా రోడ్ల నిర్మాణం, అందుకవసరమైన అటవీ అనుమతులు వంటివి ఈ ప్రణాళికలో పొందుపరుస్తారు. ఉదా.. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయం ప్రస్తుతం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆలయం చుట్టుపక్కల మరో 15 ఎకరాలు కూడా దేవుడి భూములే. ఆలయాన్ని విశాలంగా, మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు వచ్చే 40–50 ఏళ్ల కాలంలో పెరిగే భక్తుల సంఖ్య, అవసరాలకు తగ్గట్లుగా మిగిలిన 15 ఎకరాల్లో కూడా భక్తులకు మరిన్ని వసతుల కల్పించాలన్నది ప్రభుత్వం, దేవదాయ శాఖ ఆలోచన. ఆలయం వద్ద ఇప్పుడున్న అన్నదానం హాల్‌ మరింత పెద్దదిగా చేయడం.. ఎండ, వానల సమయంలో భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా క్యూ కాంపెక్స్‌ నిర్మాణం.. ఆలయ పరిసరాల్లో పార్కు నిర్మాణం.. ప్రత్యేక బస్టాండ్, షాపింగ్‌ కాంపెక్స్, కల్యాణ మండపం, గెస్ట్‌హౌస్‌ వంటివి కొత్తగా ఏర్పాటుచేయాలన్నది ఆలోచన. ఒకేసారి కాకుండా వచ్చే 15–20 ఏళ్లలో వాటన్నింటినీ పూర్తిచేయాలన్నది లక్ష్యం. వీటన్నింటికీ సంబంధించి ముందస్తుగా ఓ మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధంచేసి దాని ప్రకారమే అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. అలాగే, శ్రీకాళహాస్తీరస్వామి ఆలయానికి అతి సమీపంలో దాదాపు 150 ఎకరాలు స్వామివారి భూములున్నాయి. అక్కడ భక్తులకు వసతి కల్పనకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ఆలయ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించబోతున్నారు. 

మాస్టర్‌ప్లాన్లకు ఉత్తర్వులు జారీ
తొలిదశలో రాష్ట్రంలోని 17 ప్రధాన ఆలయాల మాస్టర్‌ ప్లాన్ల రూపకల్పనకు దేవదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకోసం జాతీయస్థాయిలో అన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా రెండు ప్రధాన సంస్థలను ఎంపిక చేశారు. వాటి ప్రతినిధులు ఆలయాలను సందర్శించి, అక్కడి పరిస్థితుల ఆధారంగా వేర్వేరుగా మాస్టర్‌ ప్లాన్‌లకు రూపకల్పన చేస్తారు. ఇందుకు సంబంధించి ఈ నెల 25లోగా ఆయా ఆలయాల ఈఓలు, ఎంపిక చేసిన సంస్థల ప్రతినిధులు ప్రాథమికంగా చర్చించుకోవాలని సూచించారు. ఈ అంశంపై ఈనెల చివరి వారంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నట్లు కమిషనర్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

తొలిదశలో మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు ఎంపిక చేసిన ఆలయాలు..
►   విజయవాడ దుర్గగుడి
►  శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సింహాచలం
►    శ్రీ వేంకట్వేశరస్వామి దేవస్థానం, ద్వారకా తిరుమల
►   శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం, మోపిదేవి, కృష్ణాజిల్లా
►   శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం, శ్రీశైలం
►    శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం, శ్రీకాళహస్తి
►  శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానం, కాణిపాకం
►    శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్‌ జిల్లా
►   శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, వాడపల్లి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
►    శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం, అన్నవరం
►   శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం, కసాపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా
►    శ్రీ మహానందీశ్వరస్వామి ఆలయం, మహానంది, ఉమ్మడి కర్నూలు జిల్లా
►   బోయకొండ గంగమ్మ ఆలయం, చౌడేపల్లి, ఉమ్మడి చిత్తూరు జిల్లా
►    శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అహోబిలం, ఉమ్మడి కర్నూలు జిల్లా
►   శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం, లోవ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
►    శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం, కోటప్పకొండ, ఉమ్మడి గుంటూరు జిల్లా
►    శ్రీ ఉమా మహేశ్వరస్వామి ఆలయం, యాగంటిపల్లె, బనగానపల్లి, ఉమ్మడి కర్నూలు జిల్లా 

మరిన్ని వార్తలు