‘బంగారు’ గనులు 

15 Dec, 2021 05:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఒకేసారి అత్యంత విలువైన ఖనిజాలున్న 22 గనులను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు

నేడు విధివిధానాలు ఖరారు చేయనున్న హైపవర్‌ కమిటీ

సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ లేనివిధంగా విలువైన 22 ఖనిజ లీజులకు ఒకేసారి వేలం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జియోగ్రాఫికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సూచించిన 9 బ్లాకులు, రాష్ట్ర మైనింగ్‌ శాఖ ఎంపిక చేసిన 13 బ్లాకులకు త్వరలో వేలం నిర్వహిస్తారు. వీటిలో 21 బ్లాకులకు కాంపోజిట్‌ లీజులు, ఒకటి సాధారణ లీజుకు ఇస్తారు. అనంతపురం జిల్లాలో 9,740 హెక్టార్లలో 10 బంగారు గనులు ఇందులో ఉన్నాయి. రామగిరి నార్త్, సౌత్, బొక్సంపల్లి నార్త్, సౌత్, జవ్వాకుల ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌ బ్లాకులుగా బంగారు గనులకు కాంపోజిట్‌ లీజులు ఇస్తారు. అలాగే శ్రీకాకుళం జిల్లా బటువ, విజయనగరం జిల్లా పెద్దలింగాలవలస, నంద, ములగపాడు, గరికపేట, శివన్నదొరవలస, బుధరాయవలసలో మాంగనీస్‌ గనులు లీజుకు ఇవ్వనుంది.

వీటిలో తొలి రెండింటిని మైనింగ్‌ శాఖ ఎంపిక చేయగా మిగిలిన ఐదింటిని జీఎస్‌ఐ నిర్థారించింది. ప్రకాశం జిల్లా లక్ష్మక్కపల్లె, అద్దంకివారిపాలెంలో ఇనుప ఖనిజం, కడప జిల్లా ఉప్పరిపల్లెలో వజ్రాల గని, నెల్లూరు జిల్లా మాసాయపేటలో బేస్‌మెటల్‌ గనికి లీజులు ఇవ్వనుంది. ఈ 21 గనుల్లో జీ–4 (ప్రాథమిక స్థాయి) సర్వే ద్వారా ఖనిజ లభ్యతను గుర్తించారు. దీనిద్వారా తవ్వబోయే ఖనిజం గురించి పూర్తి సమాచారం తెలియదు. జీ–3, జీ–2, జీ–1 స్థాయి సర్వేలు చేశాకే అక్కడ ఎంత ఖనిజం ఉంది, ఏ గ్రేడ్‌ది ఉందనే వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం జీ–4 సర్వే ఆధారంగా వేలం పాటలు నిర్వహించి కాంపోజిట్‌ లీజులు ఇస్తారు. ఈ లీజు తీసుకుంటే వెంటనే మైనింగ్‌కు అవకాశం ఉండదు. లీజు పొందిన వారే మలి దశ సర్వేలు చేయించుకోవాలి. ఇందుకు కొన్నేళ్లు సమయం ఇస్తారు. ఆ తర్వాత ఆ లీజులను సాధారణ లీజులుగా మారుస్తారు. ఇవి కాకుండా విజయనగరం జిల్లా చిన్నబంటుపల్లిలో మాంగనీస్‌ గనికి సాధారణ లీజుకు వేలం నిర్వహించనున్నారు. 

నేడు హైపవర్‌ కమిటీ సమావేశం  
ఈ లీజుల వేలానికి విధివిధానాలు ఖరారు చేసేందుకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ బుధవారం సమావేశం కానుంది. రిజర్వు ధర, ప్రీమియం, వేలం ఎలా నిర్వహించాలనే అంశాలను ఈ కమిటీ ఖరారు చేస్తుంది. వాటి ప్రకారం 22 బ్లాకులకు మైనింగ్‌ శాఖ టెండర్లు పిలుస్తుంది. వీటన్నింటికీ లీజులు ఖరారైతే ఒకేసారి భారీ స్థాయిలో లీజులు మంజూరు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఎటువంటి ఆటంకాలు లేకుండా గొర్లగుట్ట లైమ్‌స్టోన్, గుటుపల్లి ఇనుప ఖనిజం బ్లాకుల లీజుల్ని కేటాయించినందుకు కేంద్రం రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల రివార్డును ఏపీకి ప్రకటించింది.   

మరిన్ని వార్తలు