వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌-2022 అవార్డుల ప్రదానం

1 Nov, 2022 17:42 IST|Sakshi

వివిధ రంగాల్లో సేవలందించిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు 

20 వైఎస్సార్‌ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్‌ సాఫల్య అవార్డులు  

ముఖ్య అతిథిగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ఆత్మీయ అతిథిగా వైఎస్‌ విజయమ్మ హాజరు 

అవార్డుల ప్రదానోత్సవానికి విశిష్ట అతిథిగా సీఎం జగన్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్‌ జీవిత సాఫల్య, వైఎస్సార్‌ సాఫల్య–2022’ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరుసగా రెండో ఏడాది ఈ అవార్డులు అందించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత  ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 'మహనీయుల సేవలకు వందనం. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు.. అసామాన్య సేవలు అందిస్తున్న మానవతా మూర్తులకు వందనం. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అవార్డులు ఇస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయాలకు వారధులుగా ఉన్నవారికి అవార్డులు అందజేస్తున్నాం. వెనకబాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులు, కళలు, పాత్రికేయులు, పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులు అందిస్తున్నాం. ఈ రోజు అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందలు' అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమ రంగాల్లో విశేషకృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు 30 అవార్డులను అందజేయనున్నారు. ఇందులో 20 వైఎస్సార్‌ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘వైఎస్సార్‌’ అవార్డులను అందజేస్తోంది.

వ్యవసాయంలో 5, కళలు–సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆయా రంగాల్లో సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషిచేసి, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు అవార్డుల్లో రాష్ట్ర హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ పెద్దపీట వేసింది. వైఎస్సార్‌ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్‌ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, వైఎస్సార్‌ సాఫల్య అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించనున్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు