ఇథనాల్‌ హబ్‌గా ఏపీ

15 Aug, 2022 03:41 IST|Sakshi

ఆహార ధాన్యాల నుంచి తయారీకి ముందుకొస్తున్న కంపెనీలు

రాష్ట్రంలో ఐవోసీ, క్రిబ్‌కో, అస్సాగో, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్‌ యూనిట్లు

సాక్షి, అమరావతి: ఇథనాల్‌ తయారీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ ఎదుగుతోంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో చెరకు నుంచే కాకుండా బియ్యం నూక, మొక్కజొన్నలు లాంటి ఆహార ధాన్యాల నుంచి ఏపీలో ఇథనాల్‌ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. భగ్గుమంటున్న ఇంధన ధరల నేపథ్యంలో 2025–26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపి విక్రయించాలన్న లక్ష్యంతో ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్‌ తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవడంతో ఏపీలో ఇథనాల్‌ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు క్రిబ్‌కో, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, అస్సాగో, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్‌ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే ప్రకటించగా మరికొన్ని కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. దీనివల్ల సుమారు రూ.1,917 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. 

ఎక్కడెక్కడ?
రూ.560 కోట్లతో నెల్లూరు జిల్లాలో క్రిబ్‌కో బయో ఇథనాల్‌ తయారీ యూనిట్‌కు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో చెరో రూ.600 కోట్లతో ఇథనాల్‌ తయారీ యూనిట్లను స్థాపిస్తున్నట్లు ప్రకటించగా రాజమహేంద్రవరం వద్ద బియ్యం నూక, పాడైన బియ్యం నుంచి ఇథనాల్‌ తయారీ యూనిట్‌ను రూ.300 కోట్లతో పెడుతున్నట్లు అస్సాగో ప్రకటించింది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎకోస్టీల్‌ సంస్థ మొక్కజొన్న నుంచి ఇథనాల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈఐడీ ప్యారీ రూ.94 కోట్లతో ఇథనాల్‌ తయారీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తోంది. రూ.84 కోట్లతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఇథనాల్‌ తయారీ యూనిట్‌ ఉత్పత్తికి సిద్ధమైంది.

ఏప్రిల్‌ నుంచి కొన్ని రాష్ట్రాల్లో..
భారీగా పెరుగుతున్న ముడి చమురు దిగుమతి వ్యయాన్ని అరికట్టేందుకు పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపి విక్రయించడాన్ని కేంద్రం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం పెట్రోల్‌లో 10.5% ఇథనాల్‌ కలిపి విక్రయిస్తుండగా 2030 నాటికి దీన్ని 20 శాతానికి పెంచాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. భారీగా పెరుగుతున్న చమురు రేట్లను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి కొన్ని రాష్ట్రాల్లో 20% ఇథనాల్‌ కలపటాన్ని తప్పనిసరి చేయగా 2025–26 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్‌ తయారీకి పచ్చజెండా ఊపింది. 

1,016 కోట్ల లీటర్లు అవసరం 
దేశంలో ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుండగా 20% లక్ష్యాన్ని చేరుకునేందుకు 2025–26 నాటికి అదనంగా 1,016 కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరం కానుందని అంచనా. చక్కెర తయారీ సంస్థలు కూడా ఇథనాల్‌ ఉత్పత్తి పెంచుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇథనాల్‌ కలపటాన్ని 20%కి పెంచడం వల్ల ఏటా ఇంధన దిగుమతి వ్యయంలో రూ.51,600 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది.

వచ్చే ఏడాది నుంచి 20 శాతం ఇథనాల్‌ బ్లెండ్‌ చేసిన పెట్రోల్‌ విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఏపీలో ఏటా 15.5 కోట్ల లీటర్ల పెట్రోల్‌ విక్రయాలు జరుగుతున్నాయని అంచనా. వచ్చే ఏడాది నాటికి 20 శాతం లక్ష్యం చేరుకోవాలంటే కనీసం 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరమవుతుందని అంచనా.

త్వరలో ఇథనాల్‌ పాలసీ
రాష్ట్రంలో ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్‌ తయారీకి పలు సంస్థల నుంచి  ప్రతిపాదనలు అందాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఇథనాల్‌ పాలసీ రూపొందిస్తున్నాం. ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత రాకుండా రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ఈ పాలసీని రూపొందిస్తున్నాం. నూకలు, పాడైన బియ్యం నుంచి మాత్రమే ఇథనాల్‌ తయారీకి అనుమతించాలన్నది ప్రభుత్వ విధానం.
– జి.సృజన, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌  

మరిన్ని వార్తలు