విదేశాలకు గుంటూరు ఘాటు.. మలేషియా, థాయ్‌లాండ్‌పై స్పెషల్‌ ఫోకస్‌

28 Jan, 2023 08:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సన్న రకం మిర్చి ఘాటును మరిన్ని దేశాలకు రుచి చూపేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి ఏటా రూ.3,502 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరుగుతుండగా 2024–25 నాటికి రూ.4,661 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాల వారీగా ఉత్పత్తులను గుర్తించి ఎగుమతులను పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి.సృజన వెల్లడించారు.

ప్రస్తుతం గుంటూరు నుంచి సుమారు 16 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుండగా అత్యధికంగా చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియాకు అత్యధికంగా జరుగుతున్నాయి. మిగిలిన దేశాలకు ఎగుమతులు నామమాత్రంగా ఉన్నాయి. థాయ్‌లాండ్‌ ఏటా దిగుమతి చేసుకుంటున్న మిర్చిలో గుంటూరు నుంచి 56.7 శాతం, మలేషియా 45.6 శాతం మాత్రమే ఉండటంతో ఎగుమతులు మరింత పెంచేలా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జీఎస్‌ రావు తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ప్యాకింగ్‌ లేకపోవడం, ఎండబెట్టడం లాంటి సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు సరిపడా లేకపోవటాన్ని ప్రధాన సమస్యలుగా గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు 121.6 ఎకర్లాల్లో స్పైసెస్‌ పార్క్‌తో పాటు క్లస్టర్‌ వ్యవస్థ అభివృద్ధి, ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్నారు. మిర్చి ఉప ఉత్పత్తులను ప్రోత్సహించేలా చిల్లీసాస్, చిల్లీ పికిల్, చిల్లీ పేస్ట్, చిల్లీ ఆయిల్‌ లాంటి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించనున్నారు.

గుంటూరు మిర్చి ప్రత్యేకతలివే..
మూడు నుంచి 5 సెంటీమీటర్ల పొడవైన గుంటూరు సన్న రకం మిరప ఎర్రటి ఎరుపుతో ఘాటు అధికంగా ఉంటుంది. విటమిన్‌ సి, ప్రోటీన్లు అధికంగా ఉండటం దీని ప్రత్యేకత. గుంటూరు మిర్చికి 2009లో భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. సన్న రకం మిర్చి సాగుకు గుంటూరు జిల్లా వాతావరణం అనుకూలం కావడంతో 77,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ మిర్చిని వంటల్లోనే కాకుండా సహజ సిద్ధమైన రంగుల తయారీలో వినియోగిస్తారు.

కాస్మొటిక్స్, పానియాలు, ఫార్మా స్యూటికల్స్, వైన్‌ తయారీతో పాటు పలు రంగాల్లో ఈ మిర్చి ఉత్పత్తులను వినియోగిస్తారు. ఇన్ని విశిష్టతలున్న గుంటూరు మిర్చిపై చైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. చైనా ఏటా దిగుమతి చేసుకునే మిర్చిలో 86.7 శాతం భారత్‌ నుంచే కావడం గమనార్హం. గుంటూరు జిల్లా నుంచి 2021–22లో చైనాకు రూ.1,296 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరిగాయి.
చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు?

మరిన్ని వార్తలు