ఏపీ: ఎగుమతుల్లో 2.7శాతం వృద్ధి 

7 Jun, 2021 09:47 IST|Sakshi

దేశవ్యాప్తంగా 7 శాతం క్షీణించిన ఎగుమతులు

దేశ ఎగుమతుల్లో 5.8 శాతం వాటాతో మన రాష్ట్రానికి 5వ స్థానం

2020–21లో రాష్ట్రం నుంచి రూ.1,07,730 కోట్ల ఎగుమతులు

కొత్తపోర్టుల నిర్మాణంతో 2030 నాటికి రూ.2.50 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యం

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వాణిజ్య ఎగుమతులు క్షీణించినా.. మన రాష్ట్రం ఎగుమతుల్లో వృద్ధి సాధించింది. దేశ వాణిజ్య ఎగుమతుల్లో గణనీయమైన వాటాను పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు అందుకుంటోంది. 2020–21లో దేశవ్యాప్తంగా ఎగుమతులు క్షీణించినప్పటికీ రాష్ట్రం వృద్ధిని నమోదు చేయడంతోపాటు రెండు స్థానాలను మెరుగుపర్చుకుంది. 2020–21లో దేశ వాణిజ్య ఎగుమతులు 7.4 శాతం క్షీణించాయి. అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 2.71 శాతం వృద్ధి చెందాయి.

2019–20లో 313 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశీయ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఎగుమతులు రూ.1,04,828.84 కోట్ల నుంచి రూ.1,07,730.13 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర ఎగుమతుల వృద్ధిలో డ్రగ్‌ ఫార్ములేషన్స్, స్టీల్‌–ఐరన్, బంగారు ఆభరణాలు, బియ్యం, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్యుత్‌ ఉపకరణాలు వంటి రంగాలు కీలకపాత్ర పోషించాయి. మన రాష్ట్ర ఎగుమతులు దేశీయ ఎగుమతుల్లో 5.8 శాతానికి సమానం. దీంతో 2019–20లో దేశీయ ఎగుమతుల్లో 7వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం రెండు స్థానాలకు ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది. 21 శాతం వాటాతో గుజరాత్‌ మొదటిస్థానంలో ఉండగా, తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (20 శాతం), తమిళనాడు (9 శాతం), ఉత్తరప్రదేశ్‌ (6 శాతం) ఉన్నాయి.

10 శాతం వాటాపై రాష్ట్రం దృష్టి 
2030 నాటికి దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవడం ద్వారా టాప్‌ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం బ్లూఎకానమీలో భాగంగా సముద్ర ఆధారిత వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా 4 పోర్టులు, 8 ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తోంది. ఇందులో 2024 నాటికి కనీసం 2 పోర్టులు, 4 ఫిషింగ్‌ హార్బర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ మారిటైమ్‌ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 15 శాతం వాటాతో సముద్ర ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉండగా, ఓడలు, పడవలు తయారీ 8.4 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. ఐరన్‌ అండ్‌ వోర్‌ (7.4%), డ్రగ్‌ ఫార్ములేషన్స్‌ (7.3%), బియ్యం (4.6%), రసాయనాలు (3.6%) ఉన్నాయి.

చదవండి: Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం    
Andhra Pradesh Government: నాణ్యమైన విద్యకు బాటలు

మరిన్ని వార్తలు