AP: బాల్య విద్యలో భళా

19 Jan, 2023 04:30 IST|Sakshi

పూర్వ ప్రాథమిక స్కూళ్లలో జాతీయ సగటుకు మించి ఏపీలో చిన్నారుల చేరికలు

బాలికల డ్రాపౌట్లు అతి తక్కువ

ఆంగ్లం సామర్థ్యంలో జాతీయ సగటుకు మించి ఫలితాలు

8వ తరగతి గణితంలోనూ అదే తరహా.. 

ట్యూషన్లకు పెరిగిన డిమాండ్‌

నాలుగేళ్ల అనంతరం అసర్‌ 2022 నివేదిక విడుదల

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యా­ర్థుల చేరికల్లో ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన ఫలితాలు సాధించినట్లు యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (అసర్‌) 2022 నివేదిక వెల్లడించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్కూళ్ల చేరికల్లో మంచి పురోగతి ఉన్నట్లు పేర్కొంది. ప్రథమ్‌ సంస్థ నిర్వ­హిం­చిన అసర్‌ సర్వే 2022ను బుధవారం విడుదల చేసింది. 2018 తరువాత నాలుగేళ్ల అనంతరం ప్రథమ్‌ సంస్థ ఈ సర్వేను ప్రకటించింది.

జాతీయ స్థాయిలో పాఠశాల విద్యారంగం, రాష్ట్రాలలో పరిస్థితులను గణాంకాలతో పొందుపరిచింది. 2014–2018 వరకు, 2018 – 2022 వరకు పరిస్థి­తులను బేరీజు వేసి ప్రమాణాలను విశ్లేషించింది.  ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యారంగ పరిస్థితిని విశ్లేషించేందుకు ప్రథమ్‌ సంస్థ 390 గ్రామాలలో సర్వే నిర్వహించింది. 7,760 కుటుంబాలు, 3 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 12,950 మంది విద్యార్ధులు సర్వేలో పాల్గొన్నారు.

► జాతీయ స్థాయిలో గత 15 ఏళ్లలో 6 – 14 ఏళ్ల వయసు పిల్లల చేరికలు 95 శాతం లోపే ఉండగా 2018 నాటికి 97.2 శాతానికి పెరిగాయి. ఇక 2022లో 98.4 శాతానికి చేరుకున్నట్లు సర్వేలో తేలింది. స్కూళ్లలో చేరని వారి సంఖ్య జాతీయ స్థాయిలో 1.6 శాతానికి తగ్గగా ఏపీలో 0.6 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. 

► మూడేళ్ల వయసు పిల్లలకు జాతీయ స్థాయిలో 78.3 శాతం మందికి బాల్యవిద్య అందుతున్నట్లు సర్వే పేర్కొంది. 2018లో ఇది 71.2 శాతం మాత్రమే ఉంది. మూడేళ్ల అనంతరం ప్రీస్కూల్, అంగన్‌వాడీ కేంద్రాలలో చేరేవారు 2018లో 57.1 శాతం మంది ఉండగా 2022లో 66.8 శాతానికి పెరిగింది. నాలుగేళ్ల వయసు చిన్నారుల చేరికలు 50.5 శాతం నుంచి 61.2 శాతానికి పెరిగాయి. ఇదే కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయికి మించి ప్రగతి సాధించినట్లు ప్రథమ్‌ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీలు, ప్రీస్కూళ్లలో చేరే పిల్లలు 2018లో 71.3 శాతం ఉండగా 2022 నాటికి 80.7 శాతానికి పెరిగారు. నాలుగేళ్ల వయసు పిల్లల చేరికలు 53.4 నుంచి 68.3 శాతానికి పెరిగాయి.

► దేశంలో ప్రభుత్వ స్కూళ్లలో 6–14 వయసు పిల్లల చేరికలు 2014 నాటికి 64.9 శాతం ఉండగా నాలుగేళ్లు పెరుగుదల లేదు. 2018 నాటికి 65.6 శాతానికి చేరుకోగా 2022లో 72.9 శాతానికి పెరిగినట్లు ప్రథమ్‌ సంస్థ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు 63.2 శాతం నుంచి 70.8 శాతానికి చేరినట్లు సర్వే పేర్కొంది. 2018 నుంచి 2022 మధ్య చేరికల్లో జాతీయ స్థాయి పెరుగుదల 7.3 కాగా ఏపీలో 7.6గా ఉంది. 

► బాలికల చేరికల విషయంలో జాతీయ స్థాయిలో ఏపీ ముందు వరుసలో నిలిచింది. 11 – 14 ఏళ్ల మధ్య వయసు బాలికల్లో పాఠశాలలకు వెళ్లని వారు జాతీయ స్థాయిలో 2006లో 10.3 శాతం కాగా 2018 నాటికి 4.1 శాతానికి తగ్గింది. 2022లో రెండు శాతానికి తగ్గిపోయింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో బాలికల డ్రాపౌట్లు 1 శాతం లోపే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 15 – 16 ఏళ్ల వయసు బాలికల్లో పాఠశాలలకు రాని వారు జాతీయ స్థాయిలో 2008 నాటికి 20 శాతం ఉండగా 2018లో అది 13.5 శాతానికి తగ్గింది. 2022 నాటికి 7.9 శాతానికి తగ్గిపోయినట్లు అసర్‌ ప్రకటించింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు దూరమైన 15 – 16 ఏళ్ల వయసు బాలికలు 2 శాతం లోపేనని తెలిపింది. మధ్యప్రదేశ్‌ (17శాతం), ఉత్తర్‌ప్రదేశ్‌ (15 శాతం), చత్తీస్‌ఘడ్‌ (11.2 శాతం)లో జాతీయ సగటుకు మించి బడికి దూరమైన బాలికలున్నట్లు పేర్కొంది. 

► దేశవ్యాప్తంగా ప్రైవేట్‌ ట్యూషన్లను ఆశ్రయిస్తున్న విద్యార్ధుల శాతం పెరిగినట్లు అసర్‌ సర్వే తెలిపింది. 1 – 8 తరగతుల విద్యార్థుల ట్యూషన్లు  2018 – 22 మధ్య మరింత పెరిగినట్లు వెల్లడించింది. 2018లో 26.4 శాతం మంది ట్యూషన్లను ఆశ్రయించగా 2022 నాటికి 30.5 శాతానికి పైగా ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్‌లలో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. 

► టీచర్లు, విద్యార్ధుల హాజరు శాతం గతంలో కన్నా మెరుగుపడినట్లు సర్వేలో తేలింది. జాతీయ స్థాయిలో 2018లో టీచర్ల అటెండెన్సు 85.4 శాతం ఉండగా 2022 నాటికి 87.1 శాతానికి పెరిగింది. గతంలో వీరి హాజరు శాతం 72 శాతం మాత్రమే ఉంది. స్కూళ్లలో పిల్లల హాజరు కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 

ఆంగ్లంలో జాతీయ సగటుకు మించి ఫలితాలు
► రాష్ట్రంలో పాఠశాల విద్యార్ధులు ఆంగ్లంలో మంచి పురోగతి సాధించారని అసర్‌ 2022 నివేదిక పేర్కొంది. ఆంగ్లం, గణితంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను నివేదికలో పొందుపరిచారు. ఇంగ్లీషులో కేపిటల్‌ లెటర్స్, స్మాల్‌ లెటర్స్, సింపుల్‌ 3 లెటర్‌ వర్డ్‌లు, అతి చిన్న వాక్యాలను ఇచ్చి 3, 5, 8 తరగతుల విద్యార్ధులతో సర్వే చేపట్టినట్లు ప్రథమ్‌ సంస్థ పేర్కొంది. 

► జాతీయ స్థాయిలో 5వ తరగతి పిల్లల్లో  2016లో ఇంగ్లీషులో సామర్థ్యాలున్న పిల్లలు 24.7 శాతం మేర ఉండగా 2022లో అది 24.5 శాతంగా ఉంది. అదే 8వ తరగతిలో 45.3 శాతం నుంచి 46.7 శాతానికి పెరుగుదల ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జాతీయ సగటును మించి ఫలితాలు నమోదయ్యాయి. ఏపీలో ఇంగ్లీషులో సామర్థ్యాలున్న (చిన్న వాక్యాలను చదవడం) పిల్లలు 5వ తరగతిలో 42.5 శాతం మంది ఉన్నట్లు నివేదిక తెలిపింది. అదే 8వ తరగతిలో 69.8 శాతం ఉన్నారు.

► అంకగణితం (అర్థమెటిక్స్‌)లో దేశవ్యాప్తంగా పిల్లల్లో సామర్థ్యాలు తగ్గాయని నివేదిక పేర్కొంది. కరోనా సమయంలో విద్యార్ధులకు ఎదురైన ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణం. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లన్నిటిలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు వివరించింది. అయితే ఏపీలో 3, 5వ తరగతుల పిల్లలు ఒకింత వెనుకబడి ఉండగా 8వ తరగతి పిల్లల సామర్థ్యాలు జాతీయ సగటుకు మించి ఉన్నాయని ప్రథమ్‌ సంస్థ వెల్లడించింది. గణితంలో విభజన (డివిజన్‌) చేసే 8వ తరగతి పిల్లలు జాతీయస్థాయిలో 2018లో 44.1 శాతం మంది ఉండగా 2022 నాటికి స్వల్పంగా 44.7 శాతానికి పెరిగింది. ఏపీలో ఇది 2018లో 47.6 శాతం కాగా 2022లో 51.7 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

మరిన్ని వార్తలు