AP: అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే..

27 Dec, 2021 07:37 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు అదనపు అప్పులకు కేంద్రం అనుమతి

అయినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ తక్కువే

తమిళనాడు బడ్జెట్‌ అంచనాకు మించి 55.54 శాతం అప్పు

బిహార్‌ 47%, కర్ణాటక 40.12%, తెలంగాణ 37.50 శాతం  

ఏపీ బడ్జెట్‌ అంచనాకు మించి 14.23 శాతమే అప్పు

2020–21 ఆర్థిక ఏడాది కాగ్‌ పరిశీలనలో వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఊదరగొడుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తేటతెల్లమైంది. కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. మరో పక్క కోవిడ్‌ నియంత్రణ, నివారణ వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్‌

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అదనపు అప్పులకు అనుమతిచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక ఏడాది అంటే 2020–21లో ఆంధ్రప్రదేశ్‌ మిగతా రాష్ట్రాల కన్నా పరిమితికి లోబడే అప్పులు చేసింది. ఈ విషయం కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ప్రాథమిక అకౌంట్ల పరిశీలనలో వెల్లడైంది. తమిళనాడు గత ఆర్థిక ఏడాది బడ్జెట్‌ అంచనాలకు మించి ఏకంగా 55.54 శాతం మేర అప్పు చేసింది. బిహార్‌ 47.69 శాతం, కర్ణాటక 40.12 శాతం, తెలంగాణ 37.50 శాతం, పంజాబ్‌ 24.22 శాతం బడ్జెట్‌ అంచనాకు మించి అప్పు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అంచనాకు మించి కేవలం 14.23 శాతమే అప్పు చేసింది.  

ఆదాయం తగ్గినప్పటికీ.. 
ఏపీ ప్రభుత్వం కోవిడ్‌ సంక్షోభంలోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిలుపుదల చేయకుండా కొనసాగించింది. కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్ల నేపథ్యంలో 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో ఏకంగా రూ.14 వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. మరో వైపు కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలకు ఏకంగా రూ.8 వేల కోట్లు వ్యయం చేసింది. మొత్తం మీద రూ.30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసింది. అయినప్పటికీ ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2020–21 ఆర్థిక ఏడాదిలో కాగ్‌ ప్రాథమిక అకౌంట్ల మేరకు వివిధ రాష్ట్రాల బడ్జెట్‌ అంచనాలు, వాస్తవంగా చేసిన అప్పుల వివరాలు ఇలా    ఉన్నాయి.

మిగతా రాష్ట్రాల కంటే తక్కువే 
విభజన సమయం నుంచి ఏపీకి తప్పనిసరి రెవెన్యూ వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కోవిడ్‌ సమయంలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అదనపు రుణాలకు అనుమతించింది. అయితే ఇటీవల కొంత మంది ఏపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తోందని తరుచూ ప్రస్తావిస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ఆర్థికంగా బలహీనంగా ఉంది. కోవిడ్‌ సంక్షోభంతో పాటు మరో పక్క రెవెన్యూ రాబడికి మించి తప్పసరి వ్యయాలు చేయాల్సి వస్తోంది. ఆస్తుల కల్పనకు సంబంధించి ఇరిగేషన్, విద్యుత్‌ వంటి ప్రాజెక్టులపై వ్యయం చేస్తున్నప్పటికీ వాటి ద్వారా వచ్చే రాబడి వాటి నిర్వహణకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తప్పనిసరి ఖర్చులు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ప్రభుత్వం 2020–21లో చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయి.  
– ఎం.ప్రసాదరావు, రిటైర్డ్‌ ఎకనమిక్‌ ప్రొఫెసర్, ఆంధ్రా విశ్వ విద్యాలయం 

మరిన్ని వార్తలు