అటు ఎన్నికలు.. ఇటు వ్యాక్సినేషన్‌ రెండూ ముఖ్యమే

22 Jan, 2021 05:50 IST|Sakshi

ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేయాలన్న హైకోర్టు

ఎన్నికల కమిషన్‌ అప్పీల్‌ను అనుమతించిన ధర్మాసనం

పంచాయతీ ఎన్నికలపై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దు

హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్‌ అమలును నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. రాష్ట్ర ప్రజలకు అటు ఎన్నికలు.. ఇటు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండూ అత్యంత ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల వాటిని ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించింది.

ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ  సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం అనుమతించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. కాగా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తీర్పులో సవివరంగా పరిణామాలు
పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన షెడ్యూల్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపివేస్తూ ఈ నెల 11న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్‌ రిట్‌ అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 19న తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీజే ధర్మాసనం గురువారం 38 పేజీల తీర్పును వెలువరించింది.

2018లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు మొదలు ఇటీవల సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వరకు స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టులో జరిగిన పరిణామాలన్నింటినీ ధర్మాసనం తీర్పులో సవివరంగా పొందుపరిచింది. ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందా? వేగంగా నిర్వహించడం సాధ్యమవుతుందా? తదితర అంశాలపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషనేనని కిషన్‌సింగ్‌ తోమర్‌ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావించిందని ధర్మాసనం తెలిపింది. ఎన్నికల కమిషన్‌ తన విచక్షణాధికారాన్ని సక్రమంగా ఉపయోగిస్తుందని భావించాలే కానీ వక్రబుద్ధితో చూడటానికి వీల్లేదని మొహీందర్‌ గిల్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో ఆ వివరణ లేదు
‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల కమిషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని సింగిల్‌ జడ్జి తన ఉత్తర్వులో పేర్కొనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్‌ సంప్రదింపులు జరిపింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఎన్నికల కమిషనర్‌ ఏకీభవించకపోయి ఉండొచ్చు. ప్రభుత్వం అందించిన వివరాలను పరిగణలోకి తీసుకోవడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందన్న సింగిల్‌ జడ్జి.. ఏ వివరాలను పరిగణనలోకి తీసుకోలేదన్న దానిపై తన ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాలను చెప్పలేదు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎన్నికల నిర్వహణ ఏ రకంగా అడ్డంకులు కలిగిస్తుందో సింగిల్‌ జడ్జి తన ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రాథమిక వివరణ ఇవ్వలేదు.

కోవిడ్‌ వ్యాక్సినేషన్, పంచాయతీ ఎన్నికలను మేళవించడం వల్ల కేటగిరి 1, కేటగిరి 2 వ్యాక్సినేషన్‌కు ఏ రకంగానూ ఇబ్బంది లేదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతే, మూడో కేటగిరి వ్యాక్సినేషన్‌కు ముందే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘రెండున్నరేళ్ల  నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యతను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్‌ ఈ నెల 8న షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎన్నికల కమిషనర్‌ తన చట్టబద్ధతమైన అధికారాన్ని ఉపయోగించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అంతిమంగా చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందా? లేదా? అన్నదే’ అని పేర్కొంది.

ఆ అప్పీల్‌కు విచారణార్హత ఉంది
‘ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్‌ రాసిన లేఖలను అడ్వొకేట్‌ జనరల్‌ ఈ కోర్టు ముందు ఉంచారు. ఎన్నికల కమిషనర్‌ మితిమీరిన భాషను వాడకుండా ఉంటే మంచిది. స్థానిక ఎన్నికలు ఏప్రిల్‌ లేదా మే లో జరుగుతాయని అధికార పార్టీ సీనియర్‌ నేత చెప్పిన దాని ఆధారంగా తన హయాంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ ఎన్నికల కమిషనర్‌ అభిప్రాయం వ్యక్తీకరించారని అడ్వొకేట్‌ జనరల్‌ చెబుతున్నారు.

పార్టీ నేత చెప్పిన దాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారే తప్ప క్షేతస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదన్న అడ్వకేట్‌ జనరల్‌ వాదనను ఆమోదించలేం. ఎన్నికల కమిషన్‌ దాఖలు చేసిన ఈ అప్పీల్‌కు విచారణార్హత ఉంది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ‘జడ్జిమెంట్‌’ నిర్వచన పరిధిలోకే వస్తాయి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్‌ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనతో ఏకీభవిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు