గాలీవాన బీభత్సం 

7 May, 2022 22:59 IST|Sakshi
జోరుగా కురుస్తున్న వర్షం, కణేకల్లులో నేలకొరిగిన వరి పంట  

గుంతకల్లు నియోజకవర్గంలోగుంతకల్లు, పామిడి, ఉరవకొండ నియోజకవర్గంలో వజ్రకరూరు, బెళుగుప్ప, రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాళ్, కణేకల్లు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు కూలాయి. వరిపంట నేలకూలింది. రబీ వేరుశనగ నూర్పిడి చేస్తుండగా వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. ఈనెలలో ఎండలు మండుతుండగా ఈదురుగాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కొంత ఉపశమనం కలిగింది.  
–సాక్షి,నెట్‌వర్క్‌ 

బెళుగుప్ప మండలంలో గురువారం రాత్రి, శుక్రవారం వర్షం కురిసింది. ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. మండల కేంద్రంలో చెట్లు విరిగి విద్యుత్‌ తీగలపై పడ్డాయి. బెళుగుప్ప, ఆవులెన్న, రామసాగరం, నక్కలపల్లి తదితర గ్రామాల్లో రబీలో సాగు చేసిన వేరుశనగ పంట నూర్పిడి చేస్తుండగా పూర్తిగా తడిసిపోయింది. ఆవులెన్నలో రైతు నరసింహకు చెందిన ట్రాక్టర్‌పై పెద్ద తుమ్మ చెట్టు పడింది.

దీంతో ఇంజిన్‌ ధ్వంసమైంది. బెళుగుప్ప వద్ద రైతు తిరుమలరెడ్డికి చెందిన మామిడి చెట్లు, ఆవులెన్నలో రైతు రామకృష్ణతో పాటు పలు చోట్ల మొక్కజొన్న పంట నేలవాలింది. బొమ్మనహాళ్‌ మండలంలోని ఉద్దేహాళ్, బొమ్మనహాళ్, ఉంతకల్లు, శ్రీధరఘట్ట, దర్గాహొన్నూరు, గోవిందవాడ, బండూరు, కృష్ణాపురం, లింగదహాళ్, కొలగానహాళ్లి తదితర గ్రామాల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.గాలీవానకు వరిపంట పూర్తిగా నేలకొరిగింది. దర్గాహొన్నూరు గ్రామ సమీపంలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఉంతకల్లు క్రాస్‌ వద్ద  ఇరువైపులా ఉన్న చెట్లు, కొమ్మలు నేలకొరిగాయి.   

నేలకొరిగిన వరిపంట
కణేకల్లు మండలంలో గురువారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది.  ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వరి పంట నేలకొరిగింది. వర్షపాతం 29.2 ఎంఎంగా నమోదైంది.కణేకల్లు, యర్రగుంట, మారెంపల్లి, 43 ఉడేగోళం, గంగలాపురం గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. కోతకొచ్చిన వరి పంట  పూర్తిగా నేలకొరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.  

గుంతకల్లు పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎస్‌జేపీ హైస్కూల్‌ రోడ్, ఆర్‌అండ్‌బీసర్కిల్‌ రోడ్, భాగ్యనగర్, తదితర ఏరియాల్లో చెట్లు నేలకూలి విద్యుత్‌తీగలపై పడ్డాయి. సుమారు మూడున్నర గంటల సేపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షంతో పలు లోతట్టు కాలనీల్లోకి నీరు చేరింది. రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహించడంతో కొంతసేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. 

కూలిన విద్యుత్‌ స్తంభాలు 
వజ్రకరూరులో శుక్రవారం సాయంత్రం అరగంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.దీంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు మెయిన్‌ రోడ్డుమీదుగా ప్రవహించింది. కుమ్మర వీధిలో నాలుగు విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ సరపరా నిలిచిపోయింది. వర్షంరాకతో వ్యవసాయ పనులు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.  

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం 
పామిడిలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలి వీచింది. దీంతో దాబా రేకులు ఎగిరిపడ్డాయి. చెట్లు నేల కూలాయి. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈ వర్షానికి చల్లటి వాతావరణం నెలకొనడంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు.  

గార్లదిన్నె : మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శుక్రవారం గాలీవాన బీభత్సంతో ఓ మోస్తారు వర్షం కురిసింది. కల్లూరులో నారాయణ స్వామి అనే వ్యక్తికి చెందిన దాబా పైకప్పు గాలికి ఎగిరిపడిపోయింది. దీంతో రూ.లక్షలు నష్టపోయినట్లు బాధితుడు తెలిపాడు. మండలంలోని పలు గ్రామాల్లో పెనుగాలుల తాకిడికి చెట్లు నేలకూలాయి. మరికొన్ని గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.  

మరిన్ని వార్తలు