ఆక్సిజన్‌ ప్లాంట్లపై అలసత్వమెందుకు?

17 Jun, 2021 05:15 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు 50 ఆక్సిజన్‌ ప్లాంట్లు మంజూరు చేసి.. ఇప్పటి వరకు వాటిని ఏర్పాటు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జూన్‌ మొదటి వారానికల్లా 18 ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధమవుతాయంటూ ఎలా చెప్పారని ప్రశ్నించింది.  ప్లాంట్ల ఏర్పాటులో నిర్లక్ష్యం తగదని హితవు పలికింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు చూపిన తర్వాత కూడా ప్లాంట్ల ఏ ర్పాటులో జాప్యం సరికాదని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో దాఖలయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ మాట్లాడుతూ.. బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్ల కొరత ఉందని చెప్పారు. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ హరి నాథ్‌ స్పందిస్తూ.. ఏపీకి   8,460 బ్లాక్‌ ఫంగస్‌ వ యల్స్‌ అందజేశామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కేటాయింపులు పెంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది.  సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ స్పందిస్తూ.. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటులో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు.  

మాటలొద్దు.. స్పష్టమైన హామీ కావాలి
దీనిపై ధర్మాసనం ఏఎస్‌జీ హరినాథ్‌ వివరణ కోరింది. స్థలం సమస్య వల్ల పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కాలేదన్నారు. సుమన్‌ స్పందిస్తూ.. రాష్ట్రంలో 50 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ప్లాంట్ల ఏర్పాటునకు అవసరమైన స్థలాల కేటాయింపు ఎప్పుడో పూర్తయ్యిందని, ఆ వివరాలను కేంద్రానికి పంపామన్నారు. దీనిపై ధర్మాసనం హరినాథ్‌ వివరణ కోరింది. మాటలు చెబితే సరిపోదని.. తదుపరి విచారణ జరిగే 24వ తేదీ నాటికి ప్లాంట్ల ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆదేశించింది.   

మరిన్ని వార్తలు