బిగ్‌బాస్‌ వంటి షోల్లో హింస, అశ్లీలత తప్ప ఏముంది?

3 May, 2022 03:34 IST|Sakshi

ఏది పడితే అది చూపిస్తామంటే కళ్లు మూసుకుని ఉండలేం

హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

పిటిషనర్‌ తరఫు న్యాయవాది తీరుపై అసహనం

సాక్షి, అమరావతి: బిగ్‌బాస్‌ వంటి షోల్లో హింస, అశ్లీలత వంటివి తప్ప ఏమున్నాయని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. రియాల్టీ షోల పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే తాము కళ్లు మూసుకుని ఉండలేమని స్పష్టం చేసింది. బిగ్‌బాస్‌ షోలో ఏం చూపిస్తున్నారో అందరికీ తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్‌ షోను ఆపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తరువాతకు సీజే ధర్మాసనం వాయిదా వేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకపోవడం పట్ల పిటిషనర్‌ తరఫు న్యాయవాదిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

నిజాయితీగా ఈ విషయాన్ని తమకు తెలియచేసి ఉంటే తాము ఈ వ్యాజ్యాన్ని విచారించేవాళ్లమని, అలా చెప్పకుండా దాచిపెట్టిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై తాము విచారణ జరపబోమంది. సీజే ధర్మాసనం వద్దే ఈ వ్యాజ్యం గురించి ప్రస్తావించుకోవాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి సెన్సార్‌షిప్‌ లేకుండా ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ వంటి కార్యక్రమాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కేవలం ధనార్జనే ధ్యేయంగా ప్రసారమవుతున్న వీటిని అడ్డుకోవాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఇలాంటి వాటిని అనుమతించేది లేదు
ఈ వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్‌బాస్‌ షో వల్ల యువత చెడిపోతుందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బిగ్‌బాస్‌ వంటి రియాలిటీ షోల్లో ఏది పడితే అది చూపిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని అనుమతించేది లేదంది. ఈ సమయంలో బిగ్‌బాస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇదే పిటిషనర్‌ బిగ్‌బాస్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి తర్వాత  ఉపసంహరించుకున్నారని తెలిపారు.

బిగ్‌బాస్‌ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఇటీవల సీజే ధర్మాసనం ముందు అభ్యర్థించారన్నారు. అయితే ధర్మాసనం వేసవి సెలవుల తరువాత చూస్తామని చెప్పిందని వివరించారు. ఈ విషయాలను ప్రస్తుత ధర్మాసనం దృష్టికి తీసుకురాలేదన్నారు. దీంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనం ముందే తేల్చుకోవాలంటూ విచారణ నుంచి ఈ వ్యాజ్యాన్ని తొలగించింది. 

మరిన్ని వార్తలు