సోషల్‌ మీడియాలో పోస్టులపై చర్యలేవి?

29 Oct, 2021 05:07 IST|Sakshi

సీబీఐపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం

న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులపై ఏం చేశారు?

పంచ్‌ ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?

విశాఖ బ్రాంచ్‌ ఎస్పీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చినప్పుడు.. రోడ్డుపై తాగి న్యూసెన్స్‌ సృష్టించిన నర్సీపట్నం వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులు అదుపు చేయడంపై విచారణకు ఆదేశించినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐపై గురువారం హైకోర్టు ధర్మాసనం మండిపడింది.

నివేదికలు సమర్పించడం మినహా సీబీఐ దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కేసు నమోదు చేసి ఏడాది కావస్తున్నా ఆ పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ కంపెనీలను ఎందుకు లిఖితపూర్వకంగా కోరలేదని నిలదీసింది. జడ్జిలపై ఇప్పటికీ కొందరు అనుచిత, అసభ్యకర పోస్టులు పెడుతూనే ఉన్నారని, అలాంటి వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించింది.

11 మందిని అరెస్టు చేశాం..
పంచ్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి విదేశాల్లో ఉంటూ నిత్యం పోస్టులు పెడుతుంటే ఎందుకు అరెస్ట్‌ చేయలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ తీరు చూస్తుంటే నిందితుల పక్షాన నిలబడుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో 11 మందిని అరెస్ట్‌ చేశామని, ఐదుగురు బెయిల్‌పై విడుదల అయ్యారని సీబీఐ తరఫు న్యాయవాది సుభాష్‌రెడ్డి తెలిపారు. ప్రభాకర్‌ అరెస్ట్‌ విషయంలో ఇంటర్‌ పోల్‌ సాయం తీసుకుంటున్నామన్నారు.  

ఇప్పుడు ఏపీనే నా సొంత రాష్ట్రం..
ప్రస్తుతం ఏపీనే తన సొంత రాష్ట్రమని, ఇక్కడ ఇలాంటి చర్యలను అనుమతించబోనని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. వ్యతిరేక తీర్పులొచ్చినప్పుడు మొదట కోర్టులే లక్ష్యాలుగా మారుతున్నాయన్నారు. దీనిపై తాము వీధుల్లోకి వెళ్లి కొట్లాడే పరిస్థితి ఉండదన్నారు. అభ్యంతరకర పోస్టులపై ఏ చర్యలు తీసుకున్నారో తమ ముందు హాజరై స్వయంగా వివరణ ఇవ్వాలని విశాఖపట్నం సీబీఐ బ్రాంచ్‌ ఎస్పీని ధర్మాసనం ఆదేశించింది.

వీటికి సంబంధించిన ‘యూఆర్‌ఎల్‌’ వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు రిజిష్ట్రార్‌ జనరల్‌ను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ధర్మాసనం తరఫున జస్టిస్‌ లలిత ఈ ఉత్తర్వులు వెలువరించారు. 

మరిన్ని వార్తలు