బాలల అక్రమ రవాణా చాలా తీవ్రమైన విషయం

5 May, 2022 04:26 IST|Sakshi

స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా.. ముఖ్యంగా చిన్న పిల్లల అక్రమ రవాణా చాలా తీవ్రమైన వ్యవహారమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాంను కోర్టు సహాయకారి (అమికస్‌ క్యూరీ)గా నియమిస్తున్నట్లు తెలిపింది. మానవ అక్రమ రవాణా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలను తెలియజేయాలని శ్రీరఘురాంను కోరింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇద్దరు చిన్నారుల అక్రమ రవాణాపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇద్దరు చిన్నారులను విక్రయించిన ఘటనలో క్రిమినల్‌ చర్యల గురించి ధర్మాసనం ఆరా తీసింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ స్పందిస్తూ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, 11 మందిని నిందితులుగా చేర్చారని తెలిపారు. వారంతా జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారని, బెయిల్‌ ఇచ్చేందుకు కింది కోర్టు నిరాకరించిందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ అక్రమ రవాణాను ఆపేందుకు ఏం చేయాలని ప్రశ్నించింది.

ఈ వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాంను ధర్మాసనం కోరింది. మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా చిన్నారుల అక్రమ రవాణా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపింది. ఈ వ్యాజ్యాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను శ్రీరఘురాంకు అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 2021లో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ప్రస్తుత సుమోటో వ్యాజ్యాలను వాటితో కలిపి విచారించాలని సుమన్‌ కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందిస్తూ తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. గతంలో దాఖలైన వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాలను కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.  

మరిన్ని వార్తలు