సంక్షేమ పథకాలకు ఆ మొత్తం ఖర్చు ప్రశంసనీయం: హైకోర్టు

29 Jun, 2021 04:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అధికారుల తీరు వల్ల ప్రభుత్వం నిందలు పడాల్సి వస్తోంది

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ లోపభూయిష్టం

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం భారీ మొత్తాలు ఖర్చు చేస్తుండటం ప్రశంసనీయమని హైకోర్టు పేర్కొంది. సంక్షేమ పథకాల కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేయడాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా లేదన్న విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. అయితే, అధికారుల తీరు వల్ల ప్రభుత్వం నిందలు పడాల్సి వస్తోందని ఆక్షేపించింది. అధికారుల తీరు దురదృష్టకరమన్న హైకోర్టు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని.. ఆ తరువాతే తమ హోదాల ప్రకారం నడుచుకోవాలని హితవు పలికింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎఫ్‌ఎంఎస్‌ లోపభూయిష్టంగా ఉందని తెలిపింది. గతంలో ట్రెజరీ ద్వారా రెండు వారాల్లో బిల్లుల చెల్లింపు జరిగేదని, ఇప్పుడు సీఎఫ్‌ఎంఎస్‌తో బిల్లుల చెల్లింపునకు రెండేళ్లు పడుతోందంటూ అసహనం వ్యక్తం చేసింది.

సాంకేతికత పెరిగినప్పుడు సౌలభ్యం కూడా అదే స్థాయిలో ఉండాలని, కానీ సీఎఫ్‌ఎంఎస్‌తో పరిస్థితి భిన్నంగా ఉందని, ఆర్థిక వ్యవహారాలన్నీ చాలా క్లిష్టతరంగా మారిపోయాయని వ్యాఖ్యానించింది. సీఎఫ్‌ఎంఎస్‌ లోపాలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించింది. బిల్లులు చెల్లించడం లేదంటూ దాఖలు చేసిన పిటిషనర్లకు బిల్లులు చెల్లించామని అధికారులు చెప్పడంతో ఓ వ్యాజ్యాన్ని మూసివేసిన హైకోర్టు, మరో వ్యాజ్యాన్ని కౌంటర్‌ పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉంచింది. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు ఎదుట హాజరైన రావత్, ద్వివేది
చిత్తూరు జిల్లా కంభంవారి పల్లె మండల పరిధిలో పూర్తి చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.24.41 లక్షల బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్‌ సీకే యర్రంరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 2018, 2019లలో ఉపాధి పథకం కింద పూర్తి చేసిన రోడ్డు పనులకు రూ.26.39 లక్షల బిల్లులను చెల్లించలేదంటూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌ రాయపురెడ్డి శ్రీనివాసరావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కోర్టుకు హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు