బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి వడ్డీ ఎలా కోరతారు?

13 Oct, 2022 06:20 IST|Sakshi

ఒప్పందంలో వడ్డీ చెల్లింపు నిబంధన లేనప్పుడు వడ్డీ అడగడానికి వీల్లేదు

కాంట్రాక్టర్లకు తేల్చిచెప్పిన హైకోర్టు ధర్మాసనం

సాక్షి, అమరావతి: ఆయా ప్రభుత్వ శాఖల పనులు చేసినందుకు చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ జాప్యానికి వడ్డీ చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతుండటంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కాంట్రాక్టు ఒప్పందంలో వడ్డీ చెల్లింపు నిబంధన ఉంటే తప్ప, బిల్లుల చెల్లింపుల్లో జరిగిన జాప్యానికి వడ్డీ కోరలేరని కాంట్రాక్టర్లకు తేల్చిచెప్పింది.

ఒప్పందంలో ఎలాంటి నిబంధన లేనప్పుడు, అధికరణ 226 కింద వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరడానికి వీల్లేదంది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులినిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

వడ్డీ చెల్లింపు ఆదేశాలపై అప్పీళ్లు..
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పరిధిలో వై.బాబూరావు అనే కాంట్రాక్టర్‌ వ్యవసాయ శాఖ పనులు చేశారు. తనకు చెల్లించాల్సిన రూ.23.21 లక్షల బకాయిలను వడ్డీతో సహా చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ పిటిషనర్‌కు చెల్లించాల్సిన రూ.23.21 లక్షలను 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి నాలుగు వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం బాబూరావుకు రూ.23.21 లక్షలు చెల్లించింది. అయితే వడ్డీ చెల్లించాలన్న సింగిల్‌ జడ్జి ఆదేశాలతోపాటు ఇలాంటివే మరికొన్నింటిపైనా ధర్మాసనం ముందు ప్రభుత్వం అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ అప్పీళ్లన్నింటిపై సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

గత ప్రభుత్వ పాపాలకు మేం మూల్యం చెల్లించుకుంటున్నాం..
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘రోజుకు 320 నుంచి 350 వరకు హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతుంటే, అందులో 220–250 వరకు రిట్‌ పిటిషన్లే ఉంటున్నాయి. ఇందులో 200 కేసుల వరకు పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ బిల్లుల చెల్లింపుల కోసం దాఖలవుతున్నవే ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలవుతున్న కోర్టు ధిక్కార వ్యాజ్యాలు ఈ సంఖ్యకు అదనం. ఇవన్నీ కూడా కోర్టుపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. ఈ సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని స్పష్టం చేసింది.

ప్రభుత్వ న్యాయవాది (ఆర్‌ అండ్‌ బీ) కోనపల్లి నర్సిరెడ్డి స్పందిస్తూ.. తాము సింగిల్‌ జడ్జి ఇచ్చిన వడ్డీ చెల్లింపు ఉత్తర్వులను మాత్రమే సవాల్‌ చేశామన్నారు. అనంతరం అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ జోక్యం చేసుకుంటూ.. ఈ బిల్లుల వ్యవహారమంతా గత ప్రభుత్వ పాపమేనన్నారు. ఆ పాపాలకు తమ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో రూ.2,800 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలా పనులు చేయకుండానే బిల్లులు సమర్పించారని, దీనిపై పరిశీలన కూడా చేస్తున్నామని తెలిపారు. అందువల్లే బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందన్నారు.

వడ్డీ చెల్లింపు ఆదేశాలు ఇవ్వడానికి మాది సివిల్‌ కోర్టు కాదు..
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వడ్డీ చెల్లించాలని కాంట్రాక్ట్‌ ఒప్పందంలో ఉందా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఒప్పందంలో వడ్డీ చెల్లింపు నిబంధన లేనప్పుడు వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కుదరదని స్పష్టం చేసింది. వడ్డీ కావాలనుకుంటే అందుకు సివిల్‌ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. వడ్డీ చెల్లింపునకు ఆదేశాలు ఇవ్వడానికి తమది సివిల్‌ కోర్టు కాదని స్పష్టం చేసింది. వడ్డీ చెల్లిం పు విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను తమ ముందుంచాలని అటు ప్రభుత్వ న్యాయవాది నర్సిరెడ్డికి, ఇటు పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రీకాంత్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు