ఆర్థిక శాఖపై హైకోర్టు అసంతృప్తి 

8 Dec, 2021 04:38 IST|Sakshi

బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది 

13న స్వయంగా హాజరై వివరణ ఇవ్వండి 

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌కు హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో నెలల తరబడి జాప్యం చేస్తోందని అసహనం వ్యక్తంచేసింది. ట్రెజరీతో సహా అన్ని శాఖలు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కు బిల్లుల మొత్తాలను పంపుతున్నా, ఆర్థిక శాఖ సంవత్సరాల తరబడి ఎందుకు చెల్లించడంలేదో ఈ నెల 13న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్‌ సింగ్‌ రావత్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషనరీ సరఫరా చేసినందుకు తమకు చెల్లించాల్సిన రూ.1.29 కోట్లను పంచాయతీరాజ్‌ శాఖ  చెల్లించడంలేదని, బకాయిలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ నేషనల్‌ కోఆపరేటివ్‌ కన్సూ్యమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ కె.శ్రీహర్ష హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా బిల్లులు చెల్లించడంలేదని తెలిపారు.

ఆర్థిక శాఖ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్‌ బిల్లులను ట్రెజరీ అధికారులు గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రాసెస్‌ చేశారని తెలిపారు. 2021 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో బిల్లుల చెల్లింపు సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు జిల్లా పంచాయతీ అధికారి నుంచి మొత్తం ప్రక్రియ తిరిగి మొదలు కావాలని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్‌ న్యాయబద్ధమైన హక్కును హరించడమేనని వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు