‘ఇప్పటం’ అబద్ధాలు అడ్డం తిరిగాయి

25 Nov, 2022 03:28 IST|Sakshi

రోడ్డు కోసం ప్రహరీలు తొలగిస్తే ఇళ్ల కూల్చివేతలంటూ ఆందోళన 

తమ సభకు స్థలమిచ్చినందుకే పగబట్టారంటూ పవన్‌ యాగీ 

జనసేనకు గొంతు కలిపిన చంద్రబాబు... తోడైన ఎల్లో మీడియా 

నోటీసులు సైతం ఇవ్వకుండానే కూల్చివేశారంటూ ఆక్రందనలు 

బాధితులకు తలా లక్ష ఇస్తా నంటూ రక్తి కట్టించిన జనసేనాని 

వాళ్లందరి చేతా హైకోర్టులో పిటిషన్లు వేయించిన ప్రతిపక్ష రాజకీయం 

పిటిషనర్ల ఉద్దేశాన్ని తప్పుబట్టిన కోర్టు 

నోటీసులిచ్చినట్లు తేలటంతో... కోర్టులతో ఆటలాడొద్దని హెచ్చరిక 

అబద్ధాలు చెప్పినందుకు కోర్టు ఖర్చులు తలా రూ.లక్ష చెల్లించాలి 

14 మందిని ఆదేశించిన కోర్టు 

(సాక్షి–అమరావతి): ఫక్తు రాజకీయం. ప్రభుత్వం ఏం చేసినా... అదో అరాచకమంటూ... అన్యాయమంటూ గగ్గోలు పెట్టడమే తెలుగుదేశం పని. ఆ పనిలో అడుగడుగునా సహకరించడానికి జనసేన. వీళ్లిద్దరికీ తోడు ఎల్లో మీడియా. ‘ఇప్పటం’ గ్రామంలో వీళ్లంతా కలిసి ఆడిన.. ఆడించిన నాటకం రాష్ట్ర హైకోర్టు సాక్షిగా బట్టబయలయింది. ఒకదానికి ఒకటి జోడిస్తూ వరస అబద్ధాలతో నకిలీ ఉద్యమాన్ని నిర్మించబోయిన ఈ పార్టీలకు గట్టి షాకే తగిలింది.

రోడ్డు విస్తరణ కోసం అడ్డుగా ఉన్న ప్రహరీలను తొలగిస్తే... ఏకంగా ఇళ్లే కూల్చేశారన్నారు. తొలగించడానికి ముందు నోటీసులిస్తే... సమాచారమేదీ లేకుండా రాత్రికి రాత్రే నిరాశ్రయులను చేశారన్నారు. రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడో మొదలైనా... స్థానికంగా జరిగిన జనసేన సభకు అక్కడి కొందరు స్థలాన్నిచ్చారని, అందుకే పగబట్టి వారి ఇళ్లు కూల్చేస్తున్నారని దుష్ప్రచారానికి దిగారు. ఈ ప్రచారమంతా నిజమంటూ తెలుగుదేశం, జనసేన నేతలు పర్యటనలూ చేశారు. బాధితులకు రూ.లక్ష చొప్పున తానే పరిహారమిస్తానంటూ కూడా పవన్‌ కల్యాణ్‌ ఆవేశపడ్డారు. కానీ... కథ అడ్డం తిరిగింది.  

అందరికీ ముందే నోటీసులిచ్చినట్లు రుజువయింది. అలా నోటీసులు అందుకున్న వారిలో అసలు పవన్‌ సభకు స్థలమిచ్చినవారే లేరన్నది కూడా బట్టబయలయింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రహరీలే తప్ప ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదని స్పష్టమయ్యింది. అన్నిటికన్నా ముఖ్యంగా... ఈ రాజకీయమంతా హైకోర్టుకు అర్థమయ్యింది. అందుకే... తమకు నోటీసులివ్వకుండానే తమ ఇళ్ల నిర్మాణాలను కూల్చేస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించిన వారికి న్యాయస్థానం గట్టి షాక్‌ ఇచ్చింది. వాస్తవాలను తొక్కి పట్టి అబద్ధాలతో పిటిషన్లు వేస్తారా? అని వారిపై ఆగ్రహించటమే కాక... కోర్టులతో ఎప్పుడూ ఆటలాడవద్దని హెచ్చరిస్తూ ఆ 14 మందికీ తలా రూ.లక్ష చొప్పున కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. 

కోర్టులతోనే ఆటలా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతో అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా తమ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ రాజకీయ నాయకుల మద్దతుతో హైకోర్టును ఆశ్రయించిన గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు ఇళ్ల యజమానులకు న్యాయస్థానం గట్టి షాక్‌నిచ్చింది. రాజకీయ నాయకులను నమ్ముకుని కోర్టు ముందు వాస్తవాలు దాచి పెట్టి అబద్ధాలతో పిటిషన్‌ దాఖలు చేసినందుకు భారీ మొత్తంలో కోర్టు ఖర్చులు విధించింది.

రోడ్డు మార్జిన్లను ఆక్రమించి కట్టిన నిర్మాణాల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించిన 14 మంది ఇళ్ల యజమానులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రూ.14 లక్షలను ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని పిటిషనర్లను ఆదేశిస్తూ కోర్టులతో ఎప్పుడూ ఆటలాడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారీ గురువారం తీర్పు వెలువరించారు.

నిజాలను దాచిపెట్టి సానుకూల ఉత్తర్వులా?
పిటిషనర్లు వాస్తవాలను తొక్కి పెట్టి అవాస్తవాలు కోర్టు ముందుంచి సానుకూల ఉత్తర్వులు పొందారంటూ హైకోర్టు ఆక్షేపించింది. ఇలాంటి పద్ధతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. నిజాలను దాచి పెట్టి కోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు పొందడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనంటూ ఇళ్ల యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు కోర్టుకు రావడం వెనుక ఎంత మాత్రం సదుద్దేశం కనిపించడం లేదంది.

షోకాజ్‌ నోటీసులు అందుకుని కూడా అవి అందలేదంటూ కోర్టు ముందే ఇళ్ల యజమానులు బుకాయించారని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అంతేకాక నోటీసుల్లో ఏముందో తెలియలేదన్న పిటిషనర్ల వాదన ఎంత మాత్రం నమ్మశక్యంగా లేదంటూ ఇళ్ల నిర్మాణాల కూల్చివేతలపై వారు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. 

నోటీసులివ్వలేదంటూ మధ్యంతర ఉత్తర్వులు పొందిన పిటిషనర్లు..
రోడ్డు విస్తరణలో భాగంగా తాడేపల్లి మునిసిపల్‌ అధికారులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు ఈ ఏడాది మే 21న చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశారు. అధికారులు మానవత్వంతో వ్యవహరించి ఇళ్ల జోలికి వెళ్లకుండా ప్రహరీలను మాత్రమే తొలగించినా కొన్ని పార్టీలు రాజకీయం చేశాయి.

రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించటాన్ని తప్పుబడుతూ రాద్ధాంతం చేశాయి. దీనికి కులం రంగు పులిమాయి. రాజకీయ పార్టీల మద్దతుతో ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది ఇళ్ల యజమానులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎలాంటి షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ తిల్హారీ.. కూల్చివేత నోటీసుల ఆధారంగా పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్‌ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్లకు అధికారులు ముందుగానే షోకాజ్‌ నోటీసులతో పాటు ఇతర నోటీసులు కూడా అందచేశారంటూ అందుకు సంబంధించి అన్ని ఆధారాలను మునిసిపల్‌ కార్పొరేషన్‌ తరఫు న్యాయవాది మలసాని మనోహర్‌రెడ్డి, నరేష్‌ కుమార్‌లు కోర్టు ముందుంచారు.

దీంతో ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి నిలదీయడంతో అధికారులు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారంటూ వాస్తవాన్ని అంగీకరించారు. దీంతో ఇళ్ల యజమానుల తీరుపై న్యాయమూర్తి మండిపడ్డారు. కోర్టు ముందు వాస్తవాలను దాచిపెట్టారంటూ పిటిషన్‌ దాఖలు చేసిన 14 మంది ఇళ్ల యజమానులను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశించిన విషయం విదితమే. 

ఇలాంటి వారిని వదిలిపెట్టడానికి వీల్లేదు..
హైకోర్టు ఆదేశాల మేరకు 14 మంది ఇళ్ల యజమానుల్లో 11 మంది గురువారం ఉదయం కోర్టు ముందు హాజరయ్యారు. ముగ్గురు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. మొదటి పిటిషనర్‌ బెల్లంకొండ వెంకట నారాయణను న్యాయమూర్తి తన దగ్గరకు పిలిచి స్వయంగా మాట్లాడారు. మీకు ఇంగ్లీష్, హిందీ వచ్చా? అని ఆరా తీశారు. తనకు రాదని వెంకట నారాయణ పేర్కొనడంతో కోర్టు అడుగుతున్న ప్రశ్నలను తెలుగులో వివరించాలని న్యాయవాది ఎస్‌.లక్ష్మీనారాయణరెడ్డిని న్యాయమూర్తి కోరారు. దీంతో న్యాయమూర్తి ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నలను లక్ష్మీనారాయణరెడ్డి తెలుగులో అనువదించి వివరించారు.

మే నెలలోనే నోటీసులు అందుకున్నామని, వాటిని తీసుకుని ఎమ్మెల్యే వద్దకు వెళ్లామని వెంకట నారాయణ వెల్లడించారు. ఆ నోటీసులో ఏం రాశారో తెలియదని, తాము పెద్దగా చదువుకోలేదని చెప్పారు. ఈ సమయంలో ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది స్పందిస్తూ పిటిషనర్లందరూ రైతులని తెలిపారు. సాధారణ నోటీసుకు, షోకాజ్‌ నోటీసుకు వారికి తేడా తెలియదన్నారు. వారు వాస్తవాలను దాచిపెట్టలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.

షోకాజ్‌ నోటీసులు అందుకుని కూడా అందలేదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి సానుకూల ఉత్తర్వులు పొందడం వాస్తవాలను దాచిపెట్టడం కాదా? అని నిలదీశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ఖర్చులు విధించడమే సరైన చర్యని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 14 మంది రూ.14 లక్షలను ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు.

పిటిషనర్లపై దయ చూపాలని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది కోరగా ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇలాంటి వారిపై జాలి చూపితే సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందన్నారు. పిటిషనర్లు చేసిన పనికి వారిపై క్రిమినల్‌ కోర్టు ధిక్కారం కింద చర్యలు చేపట్టాల్సి ఉన్నా  ఆ పని చేయడం లేదని, కేవలం ఖర్చులు విధించేందుకే పరిమితం అవుతున్నామంటూ ఆ మేరకు ఉత్తర్వులిచ్చారు. 

మరిన్ని వార్తలు