ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?

29 Sep, 2022 05:52 IST|Sakshi

డీజీపీ స్వయంగా సర్క్యులర్‌ జారీ చేసినా పట్టదా? 

కిందిస్థాయి పోలీసులపై హైకోర్టు మండిపాటు 

ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాలని డీజీపీకి ఆదేశం 

సాక్షి, అమరావతి: నిత్యావసర వస్తువుల చట్టం (ఈసీఏ) కింద నిత్యావసరాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాల జప్తు వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30న స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈసీ చట్టం కింద అక్రమ రవాణా వాహనాలను జప్తు చేసే అధికారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ)కన్నా తక్కువ స్థాయి అధికారులకు లేదంటూ తాము పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోవడంపై వివరణ ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది.

ఈ వాహనాల జప్తు అధికారం ఎస్‌ఐకన్నా తక్కువ స్థాయి  అధికారులకు లేదంటూ అన్ని జిల్లాల యూనిట్లకు, పోలీస్‌ కమిషనర్లకు డీజీపీ స్వయంగా జారీచేసిన సర్క్యులర్‌ అమలుకు నోచుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. స్థాయి లేని అధికారులు తమ వాహనాలు జప్తు చేస్తూనే ఉన్నారన్న ఫిర్యాదులతో పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయని తెలిపింది. సంబంధిత అధికారి జప్తు చేస్తేనే ఆ వాహనాలపై కేసులు చెల్లుబాటు అవుతాయని, లేని పక్షంలో చెల్లవని స్పష్టం చేసింది.

ఆ కేసులు న్యాయ సమీక్షకు నిలబడవని తేల్చి చెప్పింది. కిందిస్థాయి పోలీసు అధికారుల అవిధేయత, అరాచక శైలిపై స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ తమ వాహనాలను పోలీసులు జప్తు చేశారని, వాటిని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మారుతీనగర్‌కు చెందిన షేక్‌ మహ్మద్, మరొకరు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు.

మరిన్ని వార్తలు