చెరువు మధ్యలో పట్టా మంజూరు చేస్తారా?

17 Mar, 2022 04:42 IST|Sakshi

రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టు మండిపాటు

సాక్షి, అమరావతి: ఓ వ్యక్తికి రెవెన్యూ అధికారులు చెరువు మధ్యలో పట్టా మంజూరు చేయడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు కలెక్టర్, తిరుపతి ఆర్డీవో, రేణిగుంట తహసీల్దార్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పట్టా పొందిన చిరంజీవి అనే వ్యక్తికి కూడా నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్‌13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం, యర్రమరెడ్డి పాళ్యం గ్రామంలోని సాగునీటి చెరువును టి.చిరంజీవి అనే వ్యక్తి పూడ్చేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆ గ్రామానికి చెందిన గూలూరు జయరామయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కొండపర్తి కిరణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ చెరువు ఆక్రమణను అడ్డుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు.

ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చిరంజీవి గతంలో పట్టా పొందారని, ఆ భూమినే ఇప్పుడు చదును చేసుకుంటున్నారని తెలిపారు. అది అతని సొంత భూమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఫొటోలను చూస్తుంటే చెరువు మధ్యలో ఉన్న భూమిని చిరంజీవి చదును చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. చెరువు మధ్యలో పట్టా ఇవ్వడం ఏమిటని విస్మయం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 13కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు