కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? 

10 Aug, 2021 03:25 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయ నిర్మాణాలా? 

పలువురు ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు ఆగ్రహం 

పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశం 

సాక్షి, అమరావతి:  ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఇతర కార్యాలయాల నిర్మాణాలేవీ చేపట్టరాదంటూ గతేడాది తామిచ్చిన ఆదేశాలను అధికారులు ఇప్పటివరకు అమలుచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నిర్మాణాలు చేపట్టకుండా కిందిస్థాయి అధికారులకు ఎందుకు ఆదేశాలు జారీచేయలేదని   ప్రశ్నించింది. ఇప్పటికైనా అధికారులకు తగిన ఆదేశాలిస్తే, కోర్టు ధిక్కార వ్యాజ్యాలను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామంది. ప్రభుత్వమే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ అన్యాయం గురించి ఎవరికి చెప్పుకుంటారని నిలదీసింది.

ఐఏఎస్‌ అధికారుల్లో అత్యధిక శాతం మంది కోర్టు ఆదేశాలను అమలుచేయాల్సిన అవసరంలేదన్న భావనలో ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఇచ్చిన ఆదేశాలు ఇప్పటివరకు అమలుకాకపోవడానికి పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్‌ శాఖ, పురపాలక శాఖ అధికారులు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు కొంత గడువునివ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌లు అభ్యర్థించడంతో అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను 31కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకూ ఎనిమిది మంది అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. 

కోర్టు ఎదుట ఉన్నతాధికారుల హాజరు 
ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలతో సహా ఇతర కార్యాలయాల నిర్మాణాలేవీ చేపట్టరాదంటూ గతేడాది న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టడంపై తాజాగా పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గత ఏడాది ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు అమలుచేయకపోవడంతో అధికారుల చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, పలు శాఖల ఉన్నతాధికారులను న్యాయమూర్తి కోర్టు ముందుకు పిలిపించారు. దీంతో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్‌ చినవీరభద్రుడు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, అప్పటి డైరెక్టర్‌ విజయకుమార్, ప్రస్తుత డైరెక్టర్‌ ఎంఎం నాయక్‌లు హైకోర్టు ముందు హాజరైన వారిలో ఉన్నారు. పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. 

మరిన్ని వార్తలు