సలహాదారులుగా ఎవరిని నియమించాలో ప్రభుత్వ ఇష్టం

16 Nov, 2022 04:44 IST|Sakshi

చంద్రశేఖర్‌రెడ్డి నియామక ఉత్తర్వులపై స్టే సాధ్యం కాదు

సాక్షి, అమరావతి: సలహాదారులుగా ఎవరిని నియమించుకోవాలన్నది పూర్తిగా ప్రభుత్వ ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఇతరుల జోక్యానికి తావు లేదంది. సలహాదారును మీరు ఎంచుకోలేరని పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)గా ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి నియామక ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చంద్రశేఖర్‌రెడ్డి నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శితో పాటు చంద్రశేఖర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఎస్‌.మునయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్యోగుల సంక్షేమం విషయంలో సలహాదారుగా ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఉద్యోగులతో సమన్వయం చేయడం ఆయన బాధ్యత అని చెప్పారు. వాస్తవానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రస్తుతం కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని, సలహాదారును నియమించాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సలహాదారుగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వ ఇష్టమని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఇతరులకు లేదంది. చంద్రశేఖర్‌రెడ్డి నియామక ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న ఉమేశ్‌ అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది.  

మరిన్ని వార్తలు