మందబయలు భూముల్లో నిర్మాణాలొద్దు 

19 Oct, 2021 04:49 IST|Sakshi

ప.గో. జిల్లా ముత్యాలపల్లిలో భూమిపై హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ రికార్డుల్లో మందబయలుగా వర్గీకరించిన భూముల్లో గ్రామ పంచాయతీలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మందబయలుగా వర్గీకరించిన భూమిని కేవలం పశువులను మేపడం వంటి సామాజిక ప్రయోజనాలకే ఉపయోగించాలి తప్ప, ఇతరత్రా వినియోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.  మందబయలుగా వర్గీకరించిన భూమిని బోర్డ్‌ స్టాండింగ్‌ ఆర్డర్‌(బీఎస్‌వో) ప్రకారం ‘అసెస్డ్‌ వేస్ట్‌ డ్రై’గా రికార్డుల్లో మార్చకుండా దానిని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదని, బీఎస్‌వో ప్రకారం భూమి వర్గీకరణను మార్చిన తరువాత ఆ భూమిని సంబంధిత పంచాయతీకి బదలాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వడం తప్పనిసరి తెలిపింది.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి సర్వే నంబర్‌ 74/3లో మందబయలు భూమిని తమకు పట్టాలుగా కేటాయించారని, ఆ భూమిలోని 24 సెంట్లలో  అధికారులు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం వంటి నిర్మాణాలు చేపడుతున్నారని, ఆ భూమిలో  నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని గ్రామానికి చెందిన కొల్లాటి ఏడుకొండలు, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. తమ స్థలం విషయంలో అధికారులు జోక్యం చేసుకుంటున్నారంటూ మరికొందరూ మరో రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు.

పిటిషనర్లు చెబుతున్న 74/3లోని భూమి ‘మందబయలు’ అని మొగల్తూరు తహసీల్దార్‌ దాఖలు చేసిన కౌంటర్‌లో  పేర్కొన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. అప్పటి ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి పిటిషనర్లు పట్టాలు పొందినట్టు తహసీల్దార్, పంచాయతీ అధికారులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. అధికారులు తమ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని, రికార్డులను బట్టి చూస్తే ఆ భూమి పిటిషనర్ల స్వాధీనంలో ఉందని పేర్కొన్నారు. ఆ భూమిని అసెస్డ్‌ వేస్ట్‌ డ్రైగా మార్చకుండా, ఆ భూమిని పంచాయతీకి బదలాయించకుండా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం వంటి నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని తన తీర్పులో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు