బెంజ్‌ సర్కిల్‌ ‘ఫ్లై ఓవర్ల’ వివాదానికి తెర

5 Sep, 2021 05:02 IST|Sakshi

రెండు ఫ్లై ఓవర్ల పక్కన సర్వీసు రోడ్డు నిర్మించాల్సిందే 

హైకోర్టు ధర్మాసనం తీర్పు 

సాక్షి, అమరావతి: రెండేళ్లుగా నలుగుతూ వస్తున్న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్ల సర్వీసు రోడ్ల నిర్మాణ వివాదానికి హైకోర్టు ధర్మాసనం తెర దించింది. కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే మొదటి ఫ్లై ఓవర్‌కు తూర్పు వైపున, చెన్నై నుంచి కోల్‌కతా వైపు వెళ్లే రెండో ఫ్‌లై ఓవర్‌కు పడమర వైపున సర్వీసు రోడ్డు నిర్మించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రెండు ఫ్‌లై ఓటర్ల పక్కన నిబంధనల ప్రకారం 7.5 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్డు నిర్మించాలంది. సర్వీసు రోడ్ల నిర్మాణ బాధ్యత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)దేనని, ఆ బాధ్యత నుంచి ఆ సంస్థ తప్పుకోజాలదని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల్లో సర్వీసు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది. సర్వీసు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని ఎవరు సేకరించాలి.. అందుకయ్యే వ్యయాన్ని ఎవరు భరించాలన్న అంశాలు ప్రజానీకానికి అవసరం లేదంది. అది ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని, ఏ కారణం చేత కూడా ప్రజలు అసౌకర్యానికి గురి కాకూడదని స్పష్టం చేసింది.

ఫకీరుద్దీన్‌ జంక్షన్‌ వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ (మొదటిది)కు తూర్పు వైపున సర్వీసు రోడ్డు నిర్మించాలని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఇదే సమయంలో రెండో ఫ్లై ఓవర్‌కు పడమర వైపున సర్వీసు రోడ్డు నిర్మాణంతో పాటు ఫకీరుద్దీన్‌ జంక్షన్‌ వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు సింగిల్‌ జడ్జి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్థానికులు దాఖలు చేసిన అప్పీల్‌ను పాక్షికంగా అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

మరిన్ని వార్తలు