Triple Talaq: రాతపూర్వకంగా కూడా తలాక్‌ చెల్లదు.. తేల్చి చెప్పిన ఏపీ  హైకోర్టు

6 Aug, 2022 08:08 IST|Sakshi

మూడుసార్లు చెప్పే తలాక్‌కు ఎలాంటి గుర్తింపులేదు: హైకోర్టు తీర్పు

తలాక్‌ చెప్పి దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లదు

విడాకులు తీసుకోవాలంటే మొదట సయోధ్యకు ప్రయత్నించాలి

అలా కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్‌ చెప్పొచ్చు

భార్య, భర్త విడివిడిగా ఉంటే భార్య జీవనభృతికి అర్హురాలే

సాక్షి, అమరావతి: నోటి మాటగా మూడుసార్లు తలాక్‌ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్‌నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దుకాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్‌కు ఎలాంటి గుర్తింపు లేదంది. మూడుసార్లు తలాక్‌ చెప్పి, దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.

ఒకవేళ ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. భార్య, భర్త ఇద్దరి తరపు మధ్యవర్తులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించాలంది. అది సాధ్యం కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్‌ చెప్పొచ్చునని, అలా చెప్పే తలాక్‌ల మధ్య తగిన వ్యవధి ఉండి తీరాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు.

ఇదీ వివాదం...
తను, తన భర్త వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో భర్త నుంచి జీవన భృతి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పి.గౌస్‌బీ 2004లో పొన్నూరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను ఆమె భర్త జాన్‌ సైదా వ్యతిరేకించారు. తాను తలాక్‌ చెప్పి, దాన్ని రిజిస్టర్‌ పోస్టులో భార్యకు పంపానని, అయితే అది తిరస్కరణ కారణంతో తిరిగి వచ్చిందని, కాబట్టి జీవన భృతి చెల్లించాల్సిన అవసరం లేదని సైదా వాదించారు.

పొన్నూరు కోర్టు సైదా వాదనలను తోసిపుచ్చుతూ గౌస్‌బీ, ఆమె కుమారుడికి నెలకు రూ.8 వేలు జీవన భృతి కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జాన్‌ సైదా అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన గుంటూరు మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు, కుమారుడికి జీవనభృతి చెల్లించాలని, గౌస్‌బీకి అవసరం లేదంటూ తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ గౌస్‌బీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారీ విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించారు. గౌస్‌బీ, ఆమె కుమారుడికి జీవనభృతి చెల్లించాలంటూ పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. భార్యకు మూడుసార్లు తలాక్‌ చెప్పి, దాన్ని రిజిస్టర్‌ పోస్టులో పంపి వివాహం రద్దయినట్లు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం ద్వారా వివాహం రద్దు కాదన్నారు. భార్య, భర్త వేర్వేరుగా ఉంటున్నందున భర్త నుంచి భరణం పొందేందుకు ఆ మహిళ అర్హురాలేనని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు