న్యాయవాదులుగా ఉంటూ.. న్యాయవ్యవస్థను కించపరుస్తారా?

18 Feb, 2022 05:44 IST|Sakshi

ఇలాంటి చర్యలను సహించేదిలేదు

సీబీఐ అరెస్టుచేసిన న్యాయవాదులను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు

బెయిల్‌ పిటిషన్లపై విచారణ 21కి వాయిదా

సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. న్యాయవాదులు మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రమేశ్‌కుమార్‌లనూ ఇటీవల అరెస్టుచేసింది. ఈ నేపథ్యంలో వారు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, హేమేంద్రనాథ్‌ రెడ్డి, న్యాయవాది కోదండరామిరెడ్డి వాదనలు వినిపించారు. మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి తమ వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారని వారు వాదించారు. కోర్టును లిఖితపూర్వకంగా క్షమాపణ కోరుతూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ కూడా ఇచ్చారన్నారు. వారి క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు వారిపై కోర్టు ధిక్కార చర్యలను మూసివేసిందన్నారు. వారి వయస్సు, అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. 

ఎంతమాత్రం సహించేదిలేదు..
ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, న్యాయవాదులుగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిందిపోయి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడి దాని ప్రతి ష్టను దిగజార్చడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేదిలేదని జస్టిస్‌ రాయ్‌ చెప్పారు. వ్యవస్థలో భాగమైన న్యాయవాదులు న్యాయవ్యవస్థను గౌరవిస్తేనే ప్రజా నీకం కూడా గౌరవిస్తుందన్నారు. సీబీఐ న్యాయవాది కె. చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందువల్ల వారికి బెయిల్‌ మంజూరు చేయరాదన్నారు.

కింది కోర్టు రెండ్రోజుల పాటు నిందితులను సీబీఐ కస్టడీకి ఇచ్చిందని, న్యాయవాది కళా నిధి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కస్టడీ ఉత్తర్వులు అమల్లో ఉండగా బెయిల్‌ మంజూరు చేయరాదన్నారు. అది న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందన్నారు. కస్టడీ ముగిసిన తరువాత కూడా వారిని జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం ఏముందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.   

మరిన్ని వార్తలు