సంక్షేమ పథకాలకు నేతల పేర్లు చట్ట విరుద్ధం కాదు

9 Dec, 2021 05:59 IST|Sakshi

కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో ఇది మామూలే

ఆ వివరాలన్నీ అఫిడవిట్‌ రూపంలో మా ముందుంచండి

పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలకు నేతల పేర్లు పెట్టడం ఎలా చట్ట విరుద్ధం అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ఆయా నేతల పేర్లతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయంది. ప్రభుత్వ పథకాల పేర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, ఆయా పథకాలకు అవి పెట్టిన పేర్లు తదితర వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ పథకాలకు రాజకీయ నేతల పేర్లు పెడుతున్నారని, ఇందులో భాగంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేర్లు పెడుతున్నారని, తద్వారా ప్రజలను ఆకర్షించడంతో పాటు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమరావతి జేఏసీ నేత డాక్టర్‌ మద్దిపాటి శైలజ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ, హోదా పేరుతో కాకుండా వ్యక్తిగత పేర్లను పథకాలకు పెట్టడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి తన పేరును పథకాలకు పెడుతూ వ్యక్తిగత ప్రచారం పొందుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపింది. సంక్షేమ పథకాలకు నేతల పేర్లు పెట్టడం ఎలా చట్ట విరుద్ధం అవుతుందని ప్రశ్నించింది. పిటిషనర్‌ ఏ పార్టీకి చెందిన వారని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇలాంటి వ్యాజ్యాలు దాఖలు వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండరాదంది. సదుద్దేశంతోనే ఈ వ్యాజ్యం దాఖలు చేశామని ప్రసాద్‌ బాబు తెలిపారు. వ్యక్తిగతంగా పేర్లు పెట్టడంపైనే తమ అభ్యంతరమన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం తమ ఆర్థిక సాయంతో అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పేర్లు పెట్టుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ లేఖలోని వివరాలను కూడా తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను పది రోజులకు 
వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు