తగినన్ని ఇంజక్షన్లు కేటాయించండి

5 Jun, 2021 06:36 IST|Sakshi

‘యాంఫోటెరిసిన్‌’ కేటాయింపుల వివరాలివ్వండి

కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం  

సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ కేసులు అధికంగా ఉన్న చోట.. అందుకు అనుగుణంగా యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్లు కూడా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో నమోదైన 1,400 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను దృష్టిలో పెట్టుకుని.. ఇంజక్షన్లు కూడా తగినన్ని కేటాయించాలని సూచించింది. ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాలకు చేసిన యాంఫోటెరిసిన్‌ ఇంజక్షన్ల కేటాయింపు వివరాలను కూడా తమ ముందుంచాలని స్పష్టం చేసింది.   ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై గత కొన్ని వారాలుగా విచారణ జరుపుతూ వస్తున్న ధర్మాసనం.. శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్ల లభ్యత, కేటాయింపుల వివరాలను కేంద్ర ప్రభుత్వం మెమో రూపంలో ధర్మాసనం ముందుంచింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసే కేటాయింపుల గురించి మెమోలో ప్రస్తావించలేదన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు 21 రోజుల కోర్సు ఇవ్వాల్సి ఉంటుందని.. తగినన్ని యాంఫోటెరిసిన్‌ ఇంజెక్షన్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మందులు వాడాల్సి వస్తోందని వివరించారు. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.హరినాథ్‌ స్పందిస్తూ.. 9.5 లక్షల ఇంజక్షన్ల దిగుమతి కోసం అమెరికాకు ఆర్డర్లు ఇచ్చినట్లు చెప్పారు. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో.. కొరత ఏర్పడిందన్నారు. అనంతరం విచారణను ధర్మాసనం 7వ తేదీకి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు